AP Governor Speech : విభజన సమస్యల నుంచి వైసీపీ విధ్వంసం వరకు గవర్నర్ ప్రసంగంలో టాప్ హైలైట్స్ ఇవే
Andhra Pradesh : 2014లో జరిగిన విభజన కంటే గత ఐదేళ్లు జరిగిన విధ్వంసం ఎక్కువని గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు. ఎన్నో ఆకాంక్షలతో ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలని కొత్త ప్రభుత్వానికి సూచించారు.
Andhra Pradesh Governor Speech In Budget Session 2024: అశాస్త్రియ విభజనతో నష్టపోయింది ఒక ఎత్తు అయితే... 2019 తర్వాత వైసీపీ పాలనలో సాగిన విధ్వంసం మరో ఎత్తు అన్నారు ఏపీ గవర్నర్ విభజన వల్ల ఏపీకి నష్టం కలిగింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్రవిభజన నుంచి ఇప్పటి ప్రభుత్వం ఏర్పాటు వరకు చాలా అంశాలను ఈ ప్రసంగంలో గవర్నర్ ప్రస్తావించారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చండి
2024 ఎన్నికల్లో విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టిన సభ్యులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. మార్పు కావాలనే ఆకాంక్షతో ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఇప్పుడు వారి ఆంకాక్షలు నెరవేర్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందని గవర్నర్ గుర్తు చేశారు. 2014లో జరిగిన రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణను అత్యంత నష్టదాయకమైన అనుభవమన్నారు. అశాస్త్రీయంగా, అప్రజాస్వామికంగా, భాగస్వాములతో చర్చలు జరపకుండా విభజించారని విమర్శించారు.
ఎన్నో కోల్పోయాం
ఆశాస్త్రీయ ఏపీ విభజన రాష్ట్ర ప్రజల మనసుపై మాయని మచ్చలా మిగిలిందన్నారు గవర్నర్. సుదీర్ఘ కాలంపాటు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నారని వాపోయారు. ఇప్పుడు మళ్లీ రాష్ట్రాన్ని పునర్ నిర్మించే పనిని చేపట్టాల్సి ఉందన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ, రాష్ట్ర విభజన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి కలిగించిందన్నారు. "ఆస్తులు, అప్పుల పంపిణీలో స్పష్టమైన అసమానతలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్ర జనాభాలో 58.32 శాతం ఉన్న రాష్ట్రం అశాస్త్రీయ విభజన వల్ల కేవలం 46 శాతం వనరులు మాత్రమే వారసత్వంగా వచ్చాయి. హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల ఆర్థిక నష్టం జరిగింది. రుణభారం ఎక్కువైంది. ప్రభుత్వ సంస్థల్లో ప్రవేశాన్ని కోల్పోయాం. జాతీయ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఉన్నత విద్యా సంస్థలను కోల్పోయాం. "
విభజనతో ఆర్థిక భారం
ఆస్తులు, రుణాల పంపిణీలో అసమానతలు గుర్తించాలన్నారు. ప్రాంతం ఆధారంగా ఆస్తులు, వినియోగం ఆధారంగా విద్యుత్తు పంపిణీ చేశారన్నారు. విద్యా సంస్థలను ఎలాంటి ఆధారం లేకుండా విభజించారని గుర్తు చేశారు. దీంతో సేవా రంగాన్ని 51 శాతం నుంచి 44 శాతానికి తగ్గడంతో ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందన్నారు. తలసరి ఆదాయం ఉమ్మడి రాష్ట్రంలో రూ.1,06,176 ఉండగా విభజిత ఆంధ్రప్రదేశ్లో రూ.93,121 కి పడిపోయిందన్నారు.
సంక్షోభంలో అవకాశాలు వెతుక్కున్నాం
"రాష్ట్ర విభజన వల్ల ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ బడ్జెటు పరిమితులు, మౌలిక సదుపాయాల లోపాలు, అపరిష్కృత సమస్యలు వంటి సవాళ్ళను లెక్కచేయకుండా 2014-19 కాలంలో ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంది. 'సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్'కు ప్రభుత్వం గట్టి పునాది వేసింది. 2014-19 ఐదేళ్ళ కాలంలో రాష్ట్ర పనితీరును పరిశీలిస్తే అభివృద్ధి, సంక్షేమం మధ్య స్పష్టమైన సమతుల్యత ఉంది. పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేసింది. కరవు నివారణ చర్యలు, రియల్ టైం గవర్నెన్స్, ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతి ప్రాంత అభివృద్ధి, కొత్త సచివాలయం, శాసనసభ భవనాల నిర్మాణం మున్నగునవి పేర్కొనదగిన కొన్ని ఉదాహరణలు."
పాలన మార్పుతో సమస్యలు రెట్టింపు
రాష్ట్రం అత్యున్నత అభివృద్ధి పథంలో పయనించడానికి సిద్ధమైన సమయంలో 2019లో జరిగిన పాలన మార్పు మళ్లీ నవ్యాంధ్రప్రదేశు విఘాతం కలిగిచిందన్నారు. 2014లో విభజన భారాన్ని చవిచూసిన రాష్ట్రం అసమర్థ పాలన రూపంలో మరో పెద్ద పరాజయాన్ని మూటగట్టుకుందన్నారు. "రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణతో పోలిస్తే 2019-24 కాలంలో జరిగిన నష్టాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. 2019, జూన్‌లో బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వం 'ప్రజావేదిక' కూల్చివేతతో విధ్వంసకర విధానంతో ప్రారంభించింది. అది 2024, జూన్‌లో పాలన ముగిసే వరకు నిరంతరాయంగా కొనసాగింది."
"గత పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జీవించే స్వేచ్ఛ కోల్పోయారు.
బ్రాండ్ ఏపీ దెబ్బతింది
'పాలన-ప్రతీకార' రాజకీయాలు రాష్ట్రాభివృద్ధి అవకాశాలను దెబ్బతీశాయి. ఏపీ హైకోర్టు రాష్ట్రంలో 'రాజ్యాంగపరమైన విచ్ఛిన్నం' జరిగిందా అనే అంశంపై న్యాయ విచారణ జరిపించాలని కూడా కోరింది. 'బ్రాండ్ ఏపి'కి అతిపెద్ద నష్టం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలేవీ ముందుకురాలేదు. అన్ని స్థాయిలలో అవినీతి విధానాలతోపాటు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆదాయాన్ని ఆర్జించే శాఖల్లో పాలనా సాధనాలను ఆయుధంగా మార్చుకోవడం, చెక్స్ & బ్యాలెన్స్ దెబ్బతినడం వల్ల అనేక ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు కంపెనీలు నిర్వీర్యమయ్యాయి. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు." అని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.