AP High Court: వ్యభిచార గృహానికి కస్టమర్‌గా వెళ్తే అతనిపై కేసు పెట్టొచ్చా? విచారణ చేయొచ్చా? ఏపీ హైకోర్టు కీలక తీర్పు
Guntur News: వ్యభిచార గృహాలను నిర్వహించే వారు, ఇంటిని వ్యభిచారం కోసం ఇచ్చేవారే శిక్షకు అర్హులని హైకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు.
AP High Court Verdict: వ్యభిచార జరుగుతున్న ఇంటిలో అడ్డంగా దొరికిపోయిన విటుడిని కోర్టులో విచారణ జరపవచ్చా? ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) కీలక తీర్పు ఇచ్చింది. వ్యభిచార గృహానికి వెళ్లిన కస్టమర్ పై కేసు నమోదు చేసి, అతణ్ని కోర్టులో విచారించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ ఇటీవల ఈ వ్యవహారంలో తీర్పు చెప్పారు. ఇందులో భాగంగా ఓ వ్యక్తిపై గుంటూరులోని ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (మొబైల్) కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును రద్దు చేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
అసలేం జరిగిందంటే..
గుంటూరు జిల్లా (Guntur District) నగరంపాలెం పోలీసులు 2020లో ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు గుంటూరులోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్(మొబైల్) కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయితే, తనపై నమోదైన ఈ కేసును రద్దు చేయాలని సదరు వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. అతని తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2020 అక్టోబరు 10న పోలీసులు పిటిషనర్‌పై కేసు నమోదు చేశారని, దర్యాప్తు జరిపి, సంబంధిత కోర్టులో ఛార్జిషీటు కూడా వేశారని తెలిపారు. వ్యభిచారం జరుగుతున్న గృహంపై పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడ పిటిషనరు కస్టమర్‌గా ఉన్నట్లుగా పోలీసులు ఛార్జ్ షీటులో పేర్కొన్నారని ధర్మాసనానికి తెలిపారు. అయితే, వ్యభిచార గృహాన్ని నిర్వహించేవారు, ఆ ఇంటిని వ్యభిచారం కోసం ఇచ్చే వారిపై కేసులు నమోదు చేసి విచారణ చేయవచ్చని, అంతేకానీ, డబ్బులు చెల్లించి విటుడిగా వెళ్లిన వ్యక్తిని విచారణ చేయవద్దని చట్టంలోని నిబంధనలు చెబుతున్నాయని తెలిపారు.
వ్యభిచార గృహానికి (Prostitution Home) వెళ్లిన కస్టమర్‌పై నమోదైన కేసును ఇదే కోర్టు గతంలో కొట్టేసిందని గుర్తు చేశారు. అదనపు పీపీ వాదనలు వినిపిస్తూ పిటిషనరు కేవలం కస్టమర్ మాత్రమేనని తెలిపారు. ఈ వ్యవహారంపై గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి వ్యభిచార గృహాలను నిర్వహించే వారు, ఇంటిని వ్యభిచారం కోసం ఇచ్చేవారే శిక్షకు అర్హులని హైకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు.
Also Read: Bigg Boss Show: అలా జరుగుతుంటే చూస్తూ ఊరుకోం - బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Also Read: సూపర్ స్టార్ నోట సీఎం జగన్ డైలాగ్, సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న అభిమానులు