EBC Nestam: మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. జనవరి 25న రూ. 15 వేలు
మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 25న వారి ఖాతాల్లో డబ్బులు వేయనుంది. ఈబీసీ నేస్తం లబ్ధిదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈబీసీ నేస్తం పథకాన్నిసీఎం ఈనెల 25న ప్రారంభించనున్నారు. అగ్రవర్ణాల్లోని 45-60 మధ్య వయస్సు గల పేద మహిళలకు ఏడాదికి 15వేల చొప్పున మూడేళ్ళలో 45వేల రూపాయల నగదు అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా 3,92,674 మంది మహిళలకు లబ్ది చేకూరనున్నట్టు ప్రభుత్వం చెబుతుంది . దీనికోసం 589.01 కోట్లు ప్రభుత్వం కేటాయించనుంది .
కృష్ణ పట్నం పవర్ ప్లాంట్ మెయింటనెన్స్ బాధ్యతలు కొత్త సంస్థకు అప్పగింత
కృష్ణపట్నం పవర్ ప్లాంట్ ఆపరేషనల్ మెయింటైనెన్స్ బాధ్యతలను వేరొకరికి అప్పగించేందుకు అవసరమైన బిడ్డింగ్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రానున్న 25 ఏళ్ల పాటు ఓ అండ్ ఏం (ఆపరేషనల్ అండ్ మెయింటైనెన్స్) కు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటూ అందులో పనిచేసే జెన్‌కో ఉద్యోగులను తిరిగి జెన్‌కోలోకి వచ్చేందుకు వెసులుబాటు కలిగించింది.
వరుస నష్టాలు చవిచూస్తున్న కృష్టపట్నం థర్మల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేబినెట్ తెలిపింది . ప్రస్తుతం కిలోవాట్ కోసం అవుతున్న ఖర్చు రూ.3.14 కాగా దాని పక్కనే ఉన్న మరో పవర్ ప్లాంట్‌లో కి లోవాట్ ఉత్పత్తికి అవుతున్న ఖర్చు రూ.2.34 గా ఉంది. ఈ ఆపరేషనల్ ఖర్చులు తగ్గించుకునేందుకు నిర్వహణ హక్కులు వేరొకరికి అప్పగించడానికి ఓ అండ్ ఎం కోసం బిడ్డింగ్‌కు ఆహ్వానించాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.
జిల్లాకో మెడికల్ కాలేజ్ కు కేబినెట్ నిర్ణయం
ఇకపై రాష్ట్రంలో ప్రతీ జిల్లాలోనూ ఒక్కో మెడికల్ కాలేజ్ ఉండాలని కేబినెట్ నిర్ణయించింది. మొత్తం 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.7880 కోట్లకు పరిపాలనా పరమైన అనుమతులకు ఆమోదం తెలిపింది. మరో రూ.3820 కోట్లతో పాత మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆస్పత్రులు పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు ఓకే చెప్పింది. అలాగే ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు 8 అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పోస్టుల మంజూరుకు కేబినెట్ అంగీకరిస్తూ ఆయుష్ విభాగంలో నేచురోపతి, యోగా డిస్పెన్సరీల్లో 78 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. దీనివల్ల మొత్తం 26 డిస్పెన్సరీల్లో ముగ్గురు చొప్పున 78 పోస్టులు భర్తీ కానున్నాయి .
రాష్ట్రంలో కొత్తగా 4 విమాన సర్వీసులకు ఇండిగోతో ఒప్పందం
కడప, కర్నూలు నుంచి విమానాలు నడిపేందుకు ఇండిగోతో ఏపీ చేసిన ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కడప విమానాశ్రయం నుంచి కడప–విజయవాడ, కడప–చెన్నై, కర్నూలు నుంచి విజయవాడకు వారానికి 4 సర్వీసులు నడపడానికి ప్రభుత్వం ఇండిగో సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ సర్వీసులు 27 మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి .
ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయ పరిస్థితులపై మంత్రివర్గసమావేశంలో చర్చ
వ్యవసాయ అనుబంధ రంగాల్లో గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ (జీజీఐ)లో ప్రథమ స్ధానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని కేబినెట్ తెలిపింది. వ్యవసాయ రంగంలో 11.3 శాతం, ఉద్యానవన రంగంలో 12.3 శాతం, పశుసంవర్ధకశాఖలో 11.7 శాతం, మాంసం ఉత్పత్తిలో 10.3 శాతం అభివృద్ధి సాధించిన ఏపీ. దీంతో పాటు క్రాప్ ఇన్సూరెన్స్‌లో అనుసరించిన వినూత్న విధానాలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో మిగిలిన రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిల్చిందని కేబినెట్‌కు అధికారులు తెలిపారు. ఉద్యానవనశాఖలో అనుసరించిన వినూత్న విధానాల ఫలితంగా,అగ్రి పుడ్ ఎంపవరింగ్ ఇండియా అవార్డ్స్ 2020–21 గాను బెస్ట్ హార్చికల్చర్ స్టేట్ ఇన్ ఇండియా అవార్డును పొందిన ఏపీ ఉద్యానవనశాఖను కేబినెట్ అభినందించింది. 2019 –20తో పోల్చుకుంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) 4.7 శాతం నుంచి 2020–21లో 12.3శాతానికి ఉద్యానవన ఉత్పత్తులు పెరిగాయని కేబినెట్ తెలిపింది.
OTS స్కీం చెల్లింపుల్లో స్వల్ప మార్పులు
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో స్వల్ప మార్పులు చేసినట్టు కేబినెట్ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 2 వాయిదాల్లో ఓటీఎస్ కట్టే వెసులుబాటు కల్పించినట్టు ప్రభుత్వం చెప్పింది. ఉగాది, దీపావళి రెండు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఓటీఎస్ ఇళ్లు, టిడ్కో, విశాఖలోని మిషనరీస్ ఆఫ్ చారిటీస్‌కి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీ మినహాయింపులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది .
మరికొన్ని కీలక నిర్ణయాలు
వీటితోపాటు తిరుపతిలో క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ కు అకాడమీ నిర్మాణం కోసం 5 ఎకరాలు కేటాయించడానికి ఆమోదం తెలిపింది మంత్రిమండలి. ఐసీడీఎస్‌కు బాలమృతం, ఫోర్టిఫైడ్ ఆహారం, తాజా పాలు అమూల్ నుంచి సరఫరాకు కేబినెట్ ఓకే చెబుతూ
ఏపీడీడీసీఎఫ్ ద్వారా అమూల్ సరఫరా చేస్తుందని కేబినెట్ తెలిపింది. అలాగే ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన మీట్ కార్పొరేషన్ కు 7 పోస్టులు మంజూరు చేసింది. వీటితో పాటు ఎండో మెంట్ చట్టం – 1987 కి సవరణలతో ఆర్డినెన్స్ జారీకి కేబినెట్ ఆమోదం చెప్పింది .
దీని ద్వారా టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి సంబంధించి సవరణలు తీసుకురావాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది . ఆచార్య ఎన్టీరంగా యూనివర్శిటీ పరిధిలో అనకాపల్లిలో రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ ( రార్స్)కు ఉచితంగా భూమి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ అంగీకరిస్తూ దానితోపాటే రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్(రార్స్)కు 50 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది .
Also Read: ఏపీ సర్కార్‌కు మరో ఝలక్.. ఇక ఆ ఉద్యోగులు కూడా రంగంలోకి.. ఈ నెల జీతాలు రానట్లే..!
Also Read: ఫిబ్రవరి 7 లేదా 8 నుంచి నిరవధిక సమ్మె.. ఏపీ ఉద్యోగ సంఘాల నిర్ణయం !