PRC Protets: ఏపీ సర్కార్‌కు మరో ఝలక్.. ఇక ఆ ఉద్యోగులు కూడా రంగంలోకి.. ఈ నెల జీతాలు రానట్లే..!
ఉద్యమంలో భాగంగా వేతన, ఇతర ప్రభుత్వ బిల్లులను ప్రాసెస్ చేసేదిలేదని పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం తేల్చి చెప్పేసింది. తాము కూడా ఉద్యమంలో పాల్గొంటామని ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పే అండ్ అకౌంట్స్ (చెల్లింపులు, ఖాతాల నిర్వహణ) ఉద్యోగుల సంఘం నుంచి మరో ఝలక్ తగిలినట్లయింది. కొత్త పీఆర్సీపై ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా వేతన, ఇతర ప్రభుత్వ బిల్లులను ప్రాసెస్ చేసేదిలేదని పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం తేల్చి చెప్పేసింది. తాము కూడా ఉద్యమంలో పాల్గొంటున్నామని ట్రెజరీ (ఖజానా) డైరెక్టర్‌కి ఉద్యోగులు లేఖ రాశారు. అన్ని జిల్లాల్లోని ఖజానా డిప్యూటీ డైరెక్టర్లకు కూడా తెలియజేశారు. సాయంత్రంలోపు బిల్లులను ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఎదురవుతోందని.. అయినా కొత్త వేతన బిల్లులు, ఇతర బిల్లులను కూడా ప్రాసెస్ చేసేది లేదని వారు తేల్చి చెప్పారు. మరోవైపు న్యాయ, ఉద్యోగుల సంఘం సైతం జేఏసీ కార్యక్రమాల్లో పాల్గొంటామని గతంలోనే ప్రకటించింది.
ఓవైపు పాత విధానం ప్రకారం జీతాల బిల్లులను సిద్ధం చేసేందుకు వీలు లేకుండా సీఎఫ్‌ఎంఎస్‌లో మార్పులు చేసేశారు. కొత్త మాడ్యుల్‌ను రూపొందించారు. మరోవైపు కొత్త పీఆర్సీ ప్రక్రియలో పాల్గొనబోమని ఉద్యోగులు తేల్చేయడంతో జనవరి వేతనాల చెల్లింపులు జరిగే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి.
కొత్త జీవోల ప్రకారం జీతాల చెల్లింపునకు ఆదేశాలు
గురువారం (జనవరి 20) ఉదయం రాష్ట్రంలోని ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్లకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కీలక ఆదేశాలిచ్చారు. జనవరి 25 నాటికి కొత్త పీఆర్‌సీ జీవోల ప్రకారం జీతాల బిల్లులు రెడీ చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్లు ఆ విషయాన్ని సబ్ ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ అధికారులకు వివరించారు. నిజానికి డీడీవోలు కొత్త స్కేళ్ల ప్రకారం బిల్లులను సమర్పించాలని, ఖజానా అధికారులు వాటిని సరి చూడాలని, తప్పులు వస్తే ఖజానా అధికారులు, ఉద్యోగులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం మార్గదర్శకాలతో జీవో ఇచ్చింది. మార్చి నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అవకాశం ఇచ్చింది. దానికి దానికి విరుద్ధంగా గురువారం మౌఖిక ఆదేశాలు ఇచ్చారు.
మరోవైపు, రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం కూడా ఈ కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తోంది. కొత్త పీఆర్సీ జీవోలు రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకమని గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఈ విషయంపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు.
Also Read: AP Employees Samme : ఫిబ్రవరి 7 లేదా 8 నుంచి నిరవధిక సమ్మె.. ఏపీ ఉద్యోగ సంఘాల నిర్ణయం !