Presidential Elections: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం జగన్, తెలంగాణలోనూ అసెంబ్లీకి నేతల క్యూ
Presidential Elections 2022: ఏపీలో వైఎస్ఆర్ సీపీ, టీడీపీలు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే.
President Elections 2022: దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభం అయింది. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగుతుంది. పార్లమెంట్‌లో ఎంపీలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తున్నారు. తొలుత పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ ఓటు వేశారు. ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని, మంత్రులు రోజా, తానేటి వనిత, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సహా పలువురు ఇప్పటికే ఓటు వేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న 174 ఎమ్మెల్యేలు సాయంత్రాని కల్లా రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో ఓటు వేయనున్నారు. ఏపీలో వైఎస్ఆర్ సీపీ, టీడీపీలు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే.
తెలంగాణలోనూ రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పోలింగ్‌లో పాల్గొనేందుకు క్రమంగా ఎమ్మెల్యేలు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు వేశారు. తొలి ఓటు హక్కును కేటీఆర్ వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం ప్రత్యేక పర్మిషన్‌తో ఏపీలోని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి తెలంగాణ శాసనసభలో ఓటు వేశారు.
మధ్యాహ్నం ఓటు వేసిన కేసీఆర్
సోమవారం మధ్యాహ్నం సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఓటు వేశారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు 116 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. ఇంకా మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తమ ఓటు హక్కును ఇంకా వినియోగించుకోలేదు. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగనుంది. ఈ నెల 21న రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు.
ఓటు వేసిన చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు
రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఎమ్మెల్యేలతో కలిసి టీడీపీ అధినేత అసెంబ్లీకి వెళ్లారు.
రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మొత్తం 175 మంది శాసన సభ్యులలో నేటి ఉదయం 11.40 గంటల వరకు మొత్తం 135 మంది శాసన సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన 40 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును ఇంకా వినియోగించుకోవాలి ఉంది.