స్పందనకు రాలేకపోతున్నారా, అయితే 1902కు కాల్ చేయండి
సీఎం జగన్ మంగళవారం జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళేందుకు అధికార యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
స్పందనకు రాలేకపోతే ఏం చేయాలనే సందేహం ఇప్పటి వరకు చాలా మంది బాధితుల్లో ఉంది. అయితే ఇప్పడు సింపుల్‌గా ఒక్క ఫోన్ కాల్‌తో తమ సమస్యను వివరించుకునే ఛాన్స్ అందుబాటులోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
సీఎం జగన్ మంగళవారం జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళేందుకు అధికార యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రతి సోమవారం వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే స్పందనకు ప్రజల నుంచి వినతులు వస్తుంటాయి.
ఒక్కో జిల్లాలో స్పందనకు కనీసం 450కి పైగా అర్జీలు రావటం కామన్ అయిపోయింది. అయితే జిల్లా కార్యాలయానికి రాలేని వారు, సీనియర్ సిటిజన్లు, మహిళలు, చాలా మంది స్పందనలో తమ బాధలను చెప్పుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వచ్చి తమ సమస్యను లేదా సామాజిక అంశాల గురించి వివరించేందుకు చాలా మంది జంకుతుంటారు.
అలాంటి పరిస్థితులకు భిన్నంగా ఇప్పుడు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన 1902 నెంబర్‌కు కాల్ చేసి నేరుగా తమ సమస్యను చెప్పుకునేందుకు వీలు కల్పించామని అధికారులు చెబుతున్నారు. స్పందనకు రాలేని వారు ఇకపై 1902కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.
ఫిర్యాదు తీసుకోవడంతోనే సరిపెట్టడం లేదని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. జిల్లా మండల గ్రామ స్థాయిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిష్కారమైన తరువాత ఫిర్యాదుదారుడుకు ఫోన్ చేసి అడిగి తెలుసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
స్పందన అప్ డేట్ కీలకం..
ఇప్పటి వరకు ఒక ఎత్తు...ఇక పై మరో ఎత్తు అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 1902కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా మరిన్ని సదుపాయాసు అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందుగా చెబుతున్న రీతిలోనే స్పందనకు అప్ డేట్ వర్షన్‌గా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ఈ కార్యక్రమం ద్వార ప్రజల సమస్యలు, వ్యక్తిగత సమస్యలను సైతం పొందుపరచేందుకు వీలుంటుంది.
చాలా చోట్ల వర్గాలు, విభేదాలు వంటి సమస్యలతో అభివృద్ధికి తీవ్ర ఆటంకాలు జరుగుతున్న సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇలాంటి వాటిని వెలుగులోకి తేవటం అంటే స్థానికంగా ఉన్న వారికి చాలా ఇబ్బందులు వస్తుంటాయి. ప్రత్యర్థులు లేదా ఆధిపత్యం చెలాయించే వ్యక్తులు ఫిర్యాదు చేసిన వారి పై దాడులకు దిగటం, వేధింపులకు గురి చేయటం వంటి సందర్భాలు కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు కూడా 1902కాల్ సెంటర్ ఉపయోగ పడుతుందని భావిస్తున్నారు.
పల్నాడు,రాయలసీమ ప్రాంతల్లో ప్రత్యర్థులు కాపు కాసి తమకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిపై దాడులు చేయటం చాలా చోట్ల వెలుగులోకి వచ్చాయి. లేదంటే ప్రభుత్వానికి, అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న వారిని అటకాయించి బెదిరింపులకు గురి చేయటం కూడా కామన్. అలాంటి పరిస్థితులకు చెక్ పెడుతూ ఇకపై ఇంట్లో ఉండే 1902కి కాల్ చేసి సమస్యను గురించి వివరించవచ్చు. ఆయా శాఖలకు చెందిన అధికారులు తప్పనిసరిగా అప్రమత్తమై సమస్యలను పరిష్కరిస్తారు. బాధితుడికి ఫోన్ చేసి సమస్య పరిష్కారానికి సంబంధించిన వివరాలను సైతం వెల్లడిస్తారు. ఇలా భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.