అటవీ భూములపై కన్నేస్తే కఠిన చర్యలు: పెద్దిరెడ్డి
అటవీప్రాంతాలకు సరిహద్దుగా ఉన్న గ్రామాల్లో అటవీభూములను కబ్జా చేసి, తప్పుడు పట్టాలు సృష్టించి భూములను తమ ఆధీనంలో ఉంచుకున్నారనే ఫిర్యాదులపై ఇప్పటికే ప్రభుత్వం దర్యాప్తు జరుపుతోందని తెలిపారు పెద్దిరెడ్డి.
ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న జగనన్న భూహక్కు-భూరక్ష సర్వే ద్వారా ప్రతి ఎకరాకు నిర్ధిష్టమైన సమాచారంతో యాజమాన్య హక్కులను గుర్తించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని అన్నారు.
రాష్ట్రంలోని అటవీప్రాంతాలకు సరిహద్దుగా ఉన్న గ్రామాల్లో అటవీభూములను కబ్జా చేసి, తప్పుడు పట్టాలు సృష్టించి భూములను తమ ఆధీనంలో ఉంచుకున్నారనే ఫిర్యాదులపై ఇప్పటికే ప్రభుత్వం దర్యాప్తు జరుపుతోందని తెలిపారు పెద్దిరెడ్డి. దాదాపు పదివేల ఎకరాలకు సంబంధించి ఈ వివాదాలు ఉన్నాయని, వాటిపై అటవీ, రెవెన్యూ అధికారుల సంయుక్త సర్వే జరుగుతోందని వివరించారు. దొంగ పట్టాలతో ఎవరైనా అటవీ భూములను తమ ఆధీనంలో పెట్టుకుని వాటిల్లో పంటలు పండించుకుంటున్నా వదిలిపెట్టేది లేదని, జాయింట్ సర్వేలో పూర్తి వివరాలు వెలుగుచూస్తాయని అన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర సర్వేలో సైతం శాటిలైట్ ఇమేజింగ్, అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరైనా సరే సులువుగా అర్థం చేసుకునే విధంగా భూముల వివరాలను నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు పెద్దిరెడ్డి. కబ్జాదారులను గుర్తించడం, ఆక్రమణకు గురైన భూములను తిరిగి అటవీశాఖకు బదలాయించడం జరుగుతుందని, ఇందులో ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ రాష్ట్రంలో అడవుల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. అటవీశాఖ ఇచ్చిన ఆర్.ఓ.ఎఫ్.ఆర్ భూములు తప్ప, మిగిలిన అటవీ భూములు అక్రమంగా ఎవరి ఆధీనంలో ఉన్నా అవి తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.
కావాలనే దుష్రచారం.....
అటవీ భూముల వ్యవహరంలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై అదికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఈ సందర్బంగా మంత్రి పెద్ది రెడ్డి స్పష్టం చేశారు. పని కట్టుకొని భూములను కబ్జా చేసి వాటిని స్వప్రయోజనాలకు వినియోగించుకొని లబ్ధి పొందుతున్న బడాబాబులపై కన్నేసి కఠినంగా,చట్టపరంగా వ్యవరించాల్సిన అవసరం ఉందని పెద్ది రెడ్డి అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయాంలోనే ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించారని ఆరోపించారు. ఇప్పుడు వాటిని వెలుగులోకి తీసుకువచ్చి, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న భూకబ్జాదారులను ప్రభుత్వం అడ్డుకుంటుందని, దీంతో కుట్రపూరితంగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ఇలాంటి అక్రమాలను ఖండించి కఠినంగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.