ఎమ్మెల్యేగా కూడా చంద్రబాబు అన్‌ఫిట్- పోలవరం చర్చలో జగన్ హాట్ కామెంట్స్
క్వశ్చన్ అవర్‌లో మొదలైన రగడ చాలా సమయం కొనసాగింది. పోలవరంపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శలపై ఏకంగా సీఎం జగన్ కలుగుజేసుకొని నాడు నేడు అంటూ స్లైడ్స్ ప్లే చేశారు. చంద్రబాబుపై హాట్‌కామెంట్స్ చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏం చెప్పామో... దానికి 30జూన్ 2021న జీవో కూడా ఇచ్చామన్నారు సీఎం జగన్. దాన్ని సభలో స్క్రీన్‌పై వేశారు. ఆర్‌ఆండ్ ఆర్ ప్యాకేజీ కింద చంద్రబాబు ప్రభుత్వం ఆరు లక్షల 86 వేల రూపాయలు ఇస్తే... అధికారంలోకి వచ్చిన వెంటనే పది లక్షలు చేస్తామన్నారు. అన్నట్టుగానే జీవో ఇచ్చాం.
డ్యాం పూర్తైన తర్వాత మొదట నీటిని నిల్వ చేసేది 41.15 మీటర్లని తెలిపారు సీఎం జగన్. ఒకేసారి మొత్తం నిల్వ చేస్తే మంచిది కాదని ఇలా చేస్తారన్నారు. దానికి తగ్గట్టుగానే పరిహారం ఇస్తామన్నారు. లక్షాల ఆరువేల ఆరుగురు నిర్వాసితుల్లో 41.15 మీటర్ల కాంటూర్‌కు సంబంధించిన వాళ్లు 20వేల 946మంది. మిగతా వాళ్లు 45.75 మీటర్ల కాంటూర్‌లోకి వస్తారు. 41.15 కాంటూర్ కిందకు వచ్చే నిర్వాసితుల్లో 14వేల 110మందికి పరిహారం ఇచ్చేశామన్నారు సీఎం జగన్. అక్టోబర్ 2 నాటికి మిగిలిన వారికి పరిహారం ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఎవరూ భయపడాల్సిన పని లేదని... బటన్ నొక్కితే అమ్మఒడి, ఆసరాను సాయం చేస్తున్నామన్నారు. ఇవి చేయలేమని ఎవరూ అనుకోవాల్సిన అవసరం లేదన్నారు.
2900 కోట్లు రాష్ట్ర నిధులు పోలవరంలో బ్లాక్ అయ్యాయని... ఇవి కేంద్రం నుంచి ఇంకా రాలేదన్నారు జగన్. కేవలం చంద్రబాబు ఆ రోజు అర్థరాత్రి లేని స్పెషల్ ప్యాకేజీ ఒకటి అంగీకరించి... పాతరేట్లకే అంగీకరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు జగన్. దాని వల్ల ఆ రేట్లే ఇస్తామంటుంటే వాళ్లను ఒప్పించడానికి అగచాట్లు పడుతున్నామన్నారు.
అనంతరం పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు హయాంలో ఏం జరిగిందో... తమ పాలనలో ఏం జరుగుతుందో చూడాలంటూ స్లైడ్‌లు వేశారు జగన్. చంద్రబాబు హయాంలో అప్రోచ్ ఛానల్ బీడుబీడుగా ఉండేదని తాము అప్రోచ్ ఛానల్ ఏర్పాటు చేసి నీటిని డైవర్ట్ చేశామన్నారు. స్పిల్ ఛానల్ ఏర్పాటు చేయకుండా కాఫర్ డ్యాం నిర్మించి పోలవరానికి తీవ్ర అన్యాయం చేశారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబుకు అసలు తెలివి ఉందా అని ప్రశ్నించారు. ఆయన ముఖ్యమంత్రిగా కాదు.. అసలు ఎమ్మెల్యేగా ఉండటానికి కూడా అన్‌ఫిట్ అని ఘాటుగా విమర్శించారు.
ఏ స్థాయిలో మభ్యపెట్టాలో ఆ స్థాయిలో మభ్య పెట్టారన్నారు సీఎం జగన్. స్పిల్‌వే పూర్తి చేయకుండానే అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాకుండా అప్పర్ కాఫర్ డ్యాం కట్టారు. దాంట్లో రెండు గ్యాప్‌లు విడిచిపెట్టారు. లోయర్ కాఫర్ డ్యాంలో రెండు గ్యాప్‌లు విడిచిపెట్టారు. భారీగా వచ్చిన వరద అటు స్పిల్‌వేలలోనుంచి వెళ్లలేకపోయింది. వాళ్లు విడిచి పెట్టిన గ్యాప్‌ల గుండా మాత్రమే పోవాల్సి వచ్చింది. దీంతో మొత్తం కొట్టుకుపోయంది. దీనికి ప్రధాన కారణం చంద్రబాబే. న్యూట్రల్‌గా ఉన్న వ్యక్తిని ఎవరినైనా అడిగితే ఇంత వెదవ పని చేసింది ముఖ్యమంత్రి ఎవరని అడుగుతారని విమర్శించారు.
ఇప్పుడు మీరు చేసిన తప్పును అవతలి వ్యక్తిపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మీడియాను అడ్డం పెట్టుకొని దుష్ప్రచారం చేశారంటున్నారు.
అప్రోచ్ ఛానల్ పూర్తి అయితేనే స్పిల్‌వే వైపు నీళ్లు డైవర్ట్ చేస్తారన్నారు. బీడుగా ఉన్న అప్రోచ్ ఛానల్‌ను తాము అధికారంలోకి వచ్చాక సరిచేశామన్నారు. తర్వాత అప్రోచ్ ఛానల్ ద్వారా నీళ్లు డైవర్ట్ చేశామన్నారు. బుద్దన్నోడు ఎవరూ అప్రోచ్ ఛానల్ పూర్తి చేయకుండా కాఫర్ డ్యాం ఎలా కడతారని ప్రశ్నించారు. ఒక్కో స్లైడ్‌లో జరిగిన పనుల పురోగతి వివరిస్తూ అప్పట్లో జరిగిన తప్పులను ఎత్తి చూపుతూ సాగింది జగన్ ప్రసంగం.
రెండున్నర కిలోమీటర్ల విస్తీర్ణంలో పోవాల్సిన స్థలాన్ని కుదించేశారని ఆరోపించారు సీఎం జగన్. దీని వల్లే కోతకు గురైందన్నారు సీఎం జగన్. ఆ కోత కారణంగా పడిన గుంతలను పూడుస్తూ మొత్తం కట్టుకొని రావాల్సి వచ్చిందన్నారు. ఈ తప్పులు కారణంగానే ఈ ఆలస్యమన్నారు. వర్షాలు కారణంగా ప్రస్తుతం పనులు జరగడం లేదని.. అక్టోబర్ నుంచి పనులు ప్రారంభిస్తామన్నారు సీఎం జగన్.