Vangalapudi Anitha : గోరంట్ల మాధవ్ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయాలి, ఎన్సీడబ్ల్యూకు అనిత లేఖ
Vangalapudi Anitha : వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై టీడీపీ నేత వంగలపూడి అనిత జాతీయ మహిళా కమిషన్ కు లేఖ రాశారు. ఎంపీ, అతనికి సహకరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Vangalapudi Anitha : వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ కు టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత లేఖ రాశారు. ఆ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయాలని కోరారు. మహిళలపై ఇంత అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీపై, ఆయనకు సహకరిస్తున్న పోలీసులపై కఠిక చర్యలు తీసుకోవాలని లేఖలో ఆమె కోరారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి మహిళలపై దాడులు పెరిగిపోయాయన్నారు. సీఎం జగన్ పాలనలో మహిళల్లో అభద్రతభావం పెరిగిందన్నారు. జూన్, 2019 నుంచి నేటి వరకు దాదాపు మహిళలపై 777 నేరాలు జరిగాయని ఆరోపించారు. మహిళలపై నేరాలు 2020లో 14,603 ఉంటే 2021లో 17,736కి పెరిగాయని అనిత అన్నారు. మహిళలపై నేరాలు 21.45% పెరిగిపోయాయన్నారు.
ఎంపీలు, మంత్రులు మహిళలపై దాడులు
మహిళలపై దాడులు చూస్తుంటే నాగరిక సమాజం తలదించుకునేలా ఉన్నాయని వంగలపూడి అనిత అన్నారు. అయినా దిశ చట్టం పేరుతో మహిళలను, సభ్య సమాజాన్ని మభ్యపెట్టేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. వాస్తవానికి దిశ చట్టమే లేదన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తి విఫలమైందని ఆరోపించారు. వైసీపీ నాయకులే స్వయంగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, బెదిరింపులకు దిగుతున్నారన్నారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అనైతిక కార్యకలాపాల వీడియోనే ఇందుకు నిదర్శనమన్నారు. సేవ చేసేందుకు ప్రజలు ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే వైసీపీ నాయకులు మాత్రం అనైతికమైనకార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు.
ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్
గోరంట్ల మాధవ్ వ్యవహారంపై సరైన విచారణ చేయకుండా ఎంపీకి క్లీన్ చిట్ ఇచ్చారని వంగలపూడి అనిత ఆరోపించారు. అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప సరైన విచారణ చేయకుండానే వీడియో మార్ఫింగ్ చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మహిళల పట్ల వైసీపీ నేతల అఘాయిత్యాలను కప్పిపుచ్చేందుకే కొంతమంది పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గోరంట్ల వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించి కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా వీడియోను టెస్ట్ చేయాలని ఆమె కోరారు. ఏపీ మహిళలపై జరుగుతున్న నేరాలు, వీటిలో అధికార వైసీపీ నేతల పాత్ర, నేతలకు సహకరిస్తున్న కొంతమంది పోలీసులపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. కమిషన్ తీసుకునే సత్వర చర్యలు మాత్రమే ఏపీలో మహిళల భద్రతకు భరోసా కల్పిస్తాయన్నారు.
రేపు గవర్నర్ కు ఫిర్యాదు
గవర్నర్ బిశ్వ భూషణ్ హరించదన్ ను మహిళా జేఏసీ నేతలు శనివారం కలవనున్నారు. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో ఎపిసోడుపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. మహిళా జేఏసీ నేతల రౌండ్ టేబుల్ సమావేశంలో గవర్నరుకు ఫిర్యాదు చేయాలన్న నిర్ణయం మేరకు బిశ్వ భూషణ్ హరిచందన్ ను కలవనున్నట్లు మహిళా జేఏసీ నేతలు తెలిపారు. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో అంశంపై గవర్నరుకు ఫిర్యాదు చేస్తామని జేఏసీ నేతలు తెలిపారు. మాధవ్ కు క్లీన్ చిట్ ఇచ్చేలా వ్యవహరిస్తోన్న అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప నిర్వాకాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పాల్పడి మాధవ్ ను ఏ విధంగా రక్షిస్తోందనే విషయాన్ని గవర్నర్ కు వివరిస్తామన్నారు. నిజాలను నిగ్గు తేల్చేందుకు తనకున్న విశేషాధికారాలను వినియోగించాల్సిందిగా గవర్నర్ ను కోరతామని మహిళా జేఏసీ నేతలు అంటున్నారు.
Also Read : MP Gorantla Madhav Issue : ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ప్రధానికి లేఖ రాసిన పంజాబ్ ఎంపీ
Also Read : CM Jagan: వారికి లేనివి, నాకు ఉన్నవి అవే - వాళ్ల కడుపు మంట కనిపిస్తోంది: సీఎం జగన్