CM Jagan Delhi Tour : రేపు దిల్లీకి సీఎం జగన్, ప్రధాని మోదీతో భేటీ!
CM Jagan Delhi Tour : సీఎం జగన్ రేపు(మంగళవారం) దిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ప్రధాని మోదీతో సీఎం సమావేశం అవ్వనున్నారు.
CM Jagan Delhi Tour : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం దిల్లీ వెళ్లనున్నారు. దిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలపై ప్రధాని మోదీతో సీఎం జగన్ మాట్లాడనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు చేసిన మరుసటి రోజే సీఎం జగన్ దిల్లీ పర్యటనకు వెళ్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో భేటీలో పోలవరం, పెండింగ్ ప్రాజెక్టుల అంశాల్ని ఈ భేటీలో ప్రస్తవించే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కూడా సీఎంవో కోరినట్లు తెలుస్తోంది.
విభజన హామీలపై చర్చించే అవకాశం
సీఎం జగన్ దిల్లీ టూర్ పై ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీతో సీఎం భేటీ అవుతారన్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సంక్షేమ పథకాల అమలుకు కేంద్రం సాయం అడగనున్నారని తెలిపారు. ఏపీ విభజన హామీలను కూడా సీఎం జగన్ ప్రధానితో భేటీలో ప్రస్తావిస్తారన్నారు. అలాగే పాలనా వికేంద్రీకరణ తమ ప్రభుత్వ లక్ష్యమని, మూడు రాజధానులలో కేంద్రం సహకారం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, కొత్త పొత్తులపై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ దిల్లీ టూర్
సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి వెళ్లారు. సీఎం వెంట ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కేశవరావు ఉన్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆందోళనలు చేస్తుంది. ఆందోళనల నేపథ్యంలో కేసీఆర్ దిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌లను సీఎం కేసీఆర్ కలవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రధాని, కేంద్ర మంత్రి కార్యాలయాలను సీఎంవో ఇప్పటికే అపాయింట్‌మెంట్ కోరింది. ఒకవేళ అపాయింట్మెంట్ లభించకపోతే సీఎం కేసీఆర్ తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నారు. దిల్లీ కేంద్రంగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తారని తెలుస్తోంది. దిల్లీ టూర్ లో సీఎం దంపతులు వైద్య పరీక్షలు కూడా చేయించుకోనున్నారని తెలుస్తోంది.
Also Read : AP New Districts Inaguration: ఏపీలో అవతరించిన కొత్త జిల్లాలు, ఇకపై మొత్తం 26 - ప్రారంభించిన సీఎం జగన్