Andhra Covid 19 Cases: ఏపీలో కొత్తగా 1,186 కరోనా కేసులు నమోదు.. పది మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 56,155 మంది నమూనాలు పరీక్షించగా 1,186 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కొత్తగా 1186 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా పది మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,396 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,473 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల కృష్ణాలో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, తూర్పుగోదావరి, చిత్తూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.
#COVIDUpdates: 01/09/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) September 1, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,12,407 పాజిటివ్ కేసు లకు గాను
*19,84,067 మంది డిశ్చార్జ్ కాగా
*13,867 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 14,473#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/XPOmVFNr74
కొవిడ్ వ్యాక్సిన్ నియర్ మీ
కరోనా టీకా కేంద్రాల వద్ద తొక్కిసలాటలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో విస్తృత సాంకేతికత ద్వారా టీకా కేంద్రాల సమాచారంతో పాటు.. ఇతర సేవలను అందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక చర్యలు చేపట్టింది. గూగుల్లో 'కొవిడ్ వ్యాక్సిన్ నియర్ మీ' అని సెర్చ్ చేసి వ్యాక్సిన్ సమాచారాన్ని తెలుసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. స్లాట్‌ల లభ్యత, పేరు నమోదు కోసం 'బుక్ అపాయింట్‌మెంట్' ఫీచర్‌ను ఉపయోగించుకోవాలని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
దేశంలో తగ్గని కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. నిన్న కాస్త తగ్గుముఖం పట్టిన కేసులు.. ఈరోజు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 41,965 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటి వరకు మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3.28 కోట్లకు చేరింది. కోవిడ్ బాధితుల్లో నిన్న 460 మంది మరణించారు. దీంతో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 4,39,020కి పెరిగింది. ఇక నిన్న ఒక్క రోజే 33,964 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 3.19 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 97.51 శాతానికి చేరినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
వ్యాక్సినేషన్ మరో రికార్డు
కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న వ్యాక్సినేషన్ డ్రైవ్ మరో రికార్డును సొంతం చేసుకుంది. ఆగస్టు నెలలో అత్యధిక వ్యాక్సినేషన్లు చేపట్టినట్లు కేంద్రం వెల్లడించింది. నిన్న (ఆగస్టు 31) ఒక్క రోజే దేశవ్యాప్తంగా.. 1.3 కోట్ల మందికి వ్యాక్సిన్లు అందించినట్లు తెలిపింది. ఇక ఆగస్టు నెల మొత్తంలో 18.6 కోట్ల మందికి టీకాలు వేసినట్లు తెలిపింది. ఈ సంఖ్య జూన్ నెలలో 12 కోట్లు కాగా.. జూలైలో 13.5 కోట్లుగా ఉంది. ఆగస్టు 21 నుంచి 27 మధ్య వారం వ్యవధిలో 4.66 కోట్ల మందికి కోవిడ్ టీకాలు అందించినట్లు చెప్పింది. అంటే సగటున రోజుకు 66.6 లక్షల టీకాలు అందించామని పేర్కొంది. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా ఓ వీడియోను ట్వీట్ చేశారు.