AP CPS Row : "సీపీఎస్" రద్దు కోసం రోడ్డెక్కిన ఏపీ ఉద్యోగులు..! వారంలో రద్దు హామీని జగన్ ఎందుకు అమలు చేయలేకపోతున్నారు..?
అధికారంలోకి వస్తే వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ రెండున్నరేళ్లు గడుస్తున్నా అమలు కాలేదు. దీంతో ఉద్యోగులు పోరుబాట పట్టారు. జగన్ ఎందుకు సీపీఎస్‌ను రద్దు చేయలేకపోతున్నారు..?
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు నిరసనల బాట పట్టారు. రెండేళ్లుగా వారు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. పీఆర్సీ అమలు చేయకపోయినా, డీఏల పెండింగ్‌లో ఉన్నా, వివిధ రకాల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నా ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదు. కానీ తొలి సారిగా సీపీఎస్ రద్దు కోసం ధర్నాలు ప్రారంభించారు. దీంతో ఒక్క సారిగా ఏపీ ఉద్యోగ వర్గాల్లో ఏం జరుగుతోందన్న చర్చ ప్రారంభమయింది. సీఎం జగన్ తాను సీఎంగా అధికారం చేపట్టి వారంలో సీపీఎస్‌ను రద్దు చేస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ అమలు కాకపోవడంతో ఉద్యోగులు రోడ్డెక్కారు.
అసలు సీపీఎస్ అంటే ఏమిటి..?
సీపీఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. 2003 చివర్లో అప్పటి వాజ్‌పేయ్ ప్రభుత్వం ఈ పధకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ స్కీమ్ ను 2004లో అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం అమలు చేసింది. సీపీఎస్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి రాకముందు ఉద్యోగుల జీతాల నుండి పెన్షన్ కోసం పైసా కూడ కట్ చేసేవారు కాదు. కొత్త పెన్షన్ స్కీమ్ ప్రకారం 2004, జనవరి 1 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరే వారందరూ సీపీఎస్ కిందికి వస్తారు. పెన్షన్ కోసం ప్రతీనెల ఉద్యోగి జీతం నుంచి 10శాతం కట్ చేస్తారు. ప్రభుత్వం మరో 10శాతం నిధులు ఇస్తుంది. ఈ పెన్షన్ నిధిని నేషనల్ పెన్షన్ స్కీం ట్రస్టు, నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ ద్వారా షేర్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెడతారు. పదవీ విరమణ సమయంలో సర్వీసు మొత్తంలో ఉద్యోగి, ప్రభుత్వ వాటా మొత్తం నిధిలో నిర్ణీత శాతంలో యాన్యుటీ ప్లాన్‌లలో ఉంచి నెలవారీ పెన్షన్ చెల్లిస్తారు. కొత్త విధానంలో పెన్షన్‌కు ఎలాంటి భరోసా ఉండదు. స్టాక్ మార్కెట్ పెరిగితే పెన్షన్ పెరుగుతుంది. సెన్సెక్స్ కుప్పకూలితే పెన్షన్ కూడా కరిగిపోతుంది. అంతే కాకుండా ఇతర సౌకర్యాలను కూడా తొలగించారు. కొత్త పెన్షన్ విధానంలో ఉద్యోగి చనిపోతే షేర్ మార్కెట్లో ఉన్న సొమ్ము మొత్తం ఆ కుటుంబానికి చెల్లిస్తారు. తరువాత ఆ ఎలాంటి పెన్షన్ ఉండదు. సీపీఎస్ కింద మదుపు చేసిన మొత్తంపై అప్పు తీసుకునే అవకాశమూ ఉండదు.
మేనిఫెస్టోలోని కీలకమైన హామీ "సీపీఎస్" రద్దు
సీపీఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఈ బిల్లు కాంగ్రెస్ తీసుకు రాగా ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సమర్థించింది. లోక్‌సభలో అనుకూలంగా ఓటు వేసింది. అయితే ఈ చట్టం నిర్బంధం కాదు. నచ్చిన రాష్ట్రాలు చేరవచ్చని సూచించింది. త్రిపుర, బెంగాల్ రాష్ట్రాలు సీపీఎస్‌లో చేరలేదు. అయితే త్రిపురలో వామపక్ష ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత సీపీఎస్‌లో ఆ రాష్ట్రం కూడా చేరింది. ఏపీ కూడా ఇష్టపూర్వకంగానే సీపీఎస్‌లో చేరింది. అప్పట్లో ఉద్యోగులు పెద్దగా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రానురాను తగ్గిపోతున్నాయన్న ఉద్దేశంతో పాత పెన్షన్ విధానం కావాలని ఉద్యోగులు ఉద్యమాలు ప్రారంభించారు. మెల్లగా అవి రాజకీయం అయ్యాయి. మేము రద్దు చేస్తామంటే మేము రద్దు చేస్తామని రాజకీయ పార్టీలు పోటీ పడి హామీలు ఇస్తున్నాయి. గతంలో టీడీపీ ఇచ్చింది. వైసీపీ కూడా ఇచ్చింది. వైసీపీ గెలవడం.. సీఎం జగన్ వారంలో రద్దు చేస్తామని ప్రకటించి ఉండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
సీపీఎస్ రద్దు చేసే విచక్షణాధికారం ఏపీ ప్రభుత్వానికి ఉంది..!
చంద్రబాబు ప్రభుత్వం సీపీఎస్ రద్దు మార్గాలను అన్వేషించడానికి టక్కర్ కమిటీని నియమించింది. ఆ కమిటీ 2019 ఫిబ్రవరిలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ కమిటీ నివేదికలో.. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసే విచక్షణాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కమిటీ నిర్ధారించింది. ప్రభుత్వానికి 141 పేజీల నివేదికను సమర్పించింది. కమిటీలో సమస్య పరిష్కారానికి రెండు ఆప్షన్లను సూచించింది. ఒకటి సీపీఎస్ రద్దు చేయడం లేదా సీపీఎస్ ను కొనసాగించి పాత పెన్షన్ విధానం వల్ల వచ్చే ప్రయోజనాలన్నింటినీ కల్పించడం... ఆప్షన్లుగా ఇచ్చింది. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అప్పటికే ఎన్నికల హడావుడి ప్రారంభమయింది.
సీఎం జగన్ తొలి కేబినెట్‌లోనే కమిటీ ఏర్పాటుకు నిర్ణయం..!
ముఖ్యమంత్రిగా జగన్ తొలి కేబినెట్ బేటీ నిర్వహించారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ వ్యవస్థ రద్దు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసి. న్యాయ సాంకేతిక సమస్యలు రాకుండా సీపీఎస్ రద్దును పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఓ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన దీనికి నేతృత్వం వహించారు. ఈ కమిటీ ఠక్కర్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి... ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతుంది. దాని ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇంత వరకూ తేల్చలేదు. 2004 తర్వాత ఉద్యోగాలు పొందినవారు 2030 నాటికి రిటైరయ్యే అవకాశం ఉండటంతో దీనిపై అంత తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని మంత్రులు వాదించడం ప్రారంభించారు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న హామీ నుంచి ఇప్పుడల్లా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదనేదాకా రావడంతో ఉద్యోగుల్లో అసహనం పెరిగిపోయింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులందరూ సీపీఎస్ కిందకు రారు. పాత పెన్షన్ విధానం ఉన్నప్పుడు ఉద్యోగంలో చేరిన వారికి ఆ విధానమే వర్తిస్తుంది.
సీపీఎస్ రద్దు చేయడం క్షణంలో పని .. కానీ ఆ భారం ఆషామాషీ కాదు..!
నిజానికి సీపీఎస్ స్కీమ్‌నురద్దు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి క్షణంలో పని. కానీ ఆ కారణంగా పడే భారం మాత్రం భరించలేనంత ఉంటుంది. సీపీఎస్ స్కీమ్‌లో చేరేందుకు పీఎఫ్ఆర్‌డీఏ చట్టంతోపాటు ఈ చట్టం అమలుకు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాల నుంచి ఏకపక్షంగా బయటకు రావాలంటే నిధుల విత్‌డ్రాలో అనూహ్యమైన, అవాంఛనీయ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. జాతీయ పెన్షన్ పథకం ట్రస్టు కమిటీది కూడా అదే అభిప్రాయం. ఈ స్కీమ్ నుండి వైదొలిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంటే కేంద్రానికి లేఖ రాస్తే ఆ దిశగా చర్యలు తీసుకొనే అవకాశాలు ఉంటాయి. నిజానికి ఏపీ మాత్రమే కాదు.. ఛత్తీస్ ఘడ్, మహరాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు ఈ స్కీమ్ నుండి బయటకు రావాలని యోచిస్తున్నాయి. కానీ, ఎలా ముందుకు వెళ్ళాలనే అంశంపై వారికి క్లారిటీలేదు. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో సీపీఎస్ స్కీమ్ లో ఆ రాష్ట్రం చేరింది. కానీ, ఈ స్కీమ్ నుండి బయటకు రావాలని కేరళ సర్కార్ భావిస్తోంది. సీపీఎస్ నుండి బయటకు రావడానికి అవకాశాలను పరిశీలించేందుకు కేరళ ప్రభుత్వం కమిటిని ఏర్పాటు చేసింది. కానీ పరిష్కారాన్ని మాత్రం కనుగొనలేకపోయింది.
సీపీఎస్ రద్దు చేయలేం... ఆ ప్రయోజనాలన్నీ కల్పిస్తామని హామీ ఇవ్వడమే పరిష్కారం..!?
సీపీఎస్ రద్దు అంత తేలికగా అయిపోయే పని అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంత కాలం వేచిచూసేవారు కాదు. ఎప్పుడో ఆ పని పూర్తి చేసే వారు. ఏదైనా హామీ అమలు చేయాలంటే ఓ బటన్ నొక్కడం లేదా ఓ సంతకం పెట్టడంతో పని పూర్తి చేసేస్తారు. అయితే సీపీఎస్ రద్దు మాత్రం అలా సాధ్యం కావడం లేదు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఒకే ఆప్షన్ ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాని ప్రకారం ప్రత్యేకహోదా విషయంలో చెప్పినట్లుగా హోదా పేరు లేకుండా ఆ ప్రయోజనాలన్నీ కల్పిస్తామని చెప్పినట్లుగా... సీపీఎస్ రద్దు అనే పేరు లేకుండా ఆ ప్రయోజనాలన్నీ కల్పిస్తామని హామీ ఇచ్చి సీపీఎస్ ఉద్యోగుల్ని సంతృప్తి పరచాల్సి ఉంటుంది. కానీ అది సాధ్యమా అన్న విషయం మాత్రం అంచనా వేయడం కష్టం.