అప్పు తీర్చలేదని తలుపులు ఎత్తుకెళ్లిన బ్యాంకు సిబ్బంది- బోరుమన్న రైతు
సహకార బ్యాంకు సిబ్బంది రైతుపై ప్రతాపం చూపారు. అప్పు ఈఎంఐ చెల్లించలేదని రైతు ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారు.
బ్యాంక్ అప్పు తీర్చలేదని వడ్డీవ్యాపారులను తలపించే రీతిలో సహకార బ్యాంక్ సిబ్బంది హంగామా చేశారు. లోన్ కిస్తీలు కట్టలేదని కస్టమర్ ఇంటికి వచ్చి ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారు. దీనిపై ఆ రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మదనాపురం గ్రామంలో సహకార బ్యాంక్ సిబ్బంది బరితెగించారు. అప్పు కట్టలేదని రైతు ఇంటికి ఉన్న తలుపులను తీసుకెళ్లిపోయారు. గ్రామానికి చెందిన రైతు మోహన్ 2021 లో డీసీసీబీ బ్యాంక్‌లో వ్యవసాయ ఋణం తీసుకున్నాడు. అప్పు తీసుకున్న మోహన్ వ్యవసాయంలో నష్టపోయింది హైదరాబాద్ వలస వచ్చేశాడు.
హైదరాబాద్ వలస వచ్చేసిన మోహన్ కూలి పని చేసుకొని జీవిస్తున్నాడు. మోహన్ కుమారుడు వీరేందర్ మదనాపురంలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. మోహన్ తీసుకున్న లోన్‌కు మూడు నెలల నుంచి ఈఎంఐ చెల్లించడం లేదు. దీనిపై సహకార బ్యాంకు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరేందర్ ఇంటికి వెళ్లిన బ్యాంకు మేనేజర్ వాగ్వాదానికి దిగారు.
తండ్రి తీర్చాలిన అప్పునకు సంబంధించిన ఈఎంఐ చెల్లించలేదని కుమారుని ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారు. బాధితుడు విషయాన్ని డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్ రావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన బ్యాంకు మేనేజర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ ఆదేశాలతో తలుపులు, ఇతర సామాగ్రి తిరిగి ఇచ్చేశారు.