India's Richest Kids: ఈ 10 మంది కార్పొరేట్ కిడ్స్ గురించి తెలుసా?
ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ.. అంటే తెలియని వారు ఎవరు ఉండరు. మరి ఫ్యూచర్ కుబేరులు ఎవరో తెలుసా..? వీరి వ్యాపారాలను ముందుకు తీసుకువెళ్లే తరువాతి తరం వీళ్లే.
మన దేశంలోని అపర కుబేరుల గురించి అందిరికీ తెలిసిందే. అయితే మరి వాళ్ల రిచ్ కిడ్స్ గురించి ఎంతమందికి తెలుసు. వాళ్ల లైఫ్ స్టైల్, పెళ్లిళ్ల గురించి వార్తలు వస్తుంటాయి అంతే తప్ప పూర్తిగా ఎవరికి తెలీదు. భారత్ లో అత్యంత సంపన్నుడైన ముఖేశ్ అంబానీ కూడా ఏదో ఒక రోజు తన బాధ్యతలను వారసులకు అప్పగించక తప్పదు. అదృష్టం ఏంటంటే ఆయనకున్న ముగ్గురు వారసుల్లో ఇద్దరు ఇప్పటికే ఆయన వ్యాపార సామ్రాజ్యంలో భాగస్వాములయ్యారు.
భవిష్యత్తులో భారత్ లోని కార్పొరేట్ సంస్థలు అన్నీ తమ తరువాతి జనరేషన్ లీడర్స్ ను చూడబోతున్నాయి. కనుక వారిపై ఓ లుక్కేద్దాం.
నెక్ట్ జనరేషన్ బిజినెస్ దిగ్గజాలు..
1. ఆకాశ్ అంబానీ
(రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, రిలైన్స్ రిటైల్ డైరెక్టర్)
ఆకాశ్ అంబానీ.. ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు. ఇప్పటికే అంబానీ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు ఆకాశ్. బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టా పొందాడు. ప్రస్తుతం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఆకాశ్ ఒకరు. అంతేకాకుండా సంస్థకు ప్రధాన వ్యూహకర్తగా ఉన్నారు.
ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత జియో దేశంలోనే అతిపెద్ద నెట్ వర్క్ గా అవతరించింది. అత్యంత తక్కువ ధరలకే అపరిమిత కాలింగ్ వంటి ఐడియాలతో ప్రత్యర్థి కంపెనీలను ఆలోచనలో పడేసింది జియో.
ముంబయి కేంద్రంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న డైమండ్స్, జ్యువెల్లరీ వ్యాపారి కూతురే శ్లోకా మెహతాను ఆకాశ్ పెళ్లి చేసుకున్నారు.
2. ఇషా అంబానీ
(రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, రిలైన్స్ రిటైల్ డైరెక్టర్)
ఇషా అంబానీ.. ఆకాశ్ ట్విన్ సిస్టర్. ఈమె కూడా అంబానీ వ్యాపార సామ్రాజ్యంలో కీ రోల్ పోషిస్తోంది. సైకాలజీలో డబుల్ డిగ్రీ చేసంది ఇషా. తండ్రి వ్యాపారంలోకి అడుగుపెట్టక ముందు ఇషా.. గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ మెక్ కిన్సీ & కో.ఐఎన్ సీ లో కొన్ని నెలలు పని చేశారు.
ప్రస్తుతం జియో సంస్థ బ్రాండింగ్, మార్కెటింగ్ పనులను ఇషా చూస్తున్నారు. 2016లో కంపెనీ ఆన్ లైన్ పోర్టల్ అజియో. కామ్ ను ఈమె ప్రారంభించారు. 2018లో ఆనంద్ పిరమల్ తో ఈషా వివాహమైంది.
3. రిషద్ ప్రేమ్ జీ
(విప్రో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్)
బిలియనీర్ అజీమ్ ప్రేమ్ జీ కుమారుడు రిషద్ ప్రేమ్ జీ. ఆయన తండ్రి తర్వాత విప్రోకు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా రిషద్ బాధ్యతలు స్వీకరించారు. వెస్లేయన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో, హార్వార్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఈయన లీడర్ షిప్ లో విప్రో సంస్థ ఎన్నో ఘనతలు సాధించింది.
4. అదర్ పూనావాలా
(సీరమ్ ఇన్ స్టిట్యూట్ సీఈఓ)
అదర్ పూనావాలా.. దేశంలోనే అపర కుబేరుల్లో ఒకరైన సైరస్ పూనావాలా వారసుడు. వెస్ట్ మినిస్టర్ యూనివర్సిటీలో చదివిన పూనావాలా.. 2011లో ఆయన తండ్రి నుంచి వ్యాపార బాధ్యలు తీసుకున్నారు. సీరమ్ ఇన్ స్టిట్యూట్.. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ. పూనావాలా వచ్చిన తర్వాతే సీరమ్.. ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాక్సిన్ ల ఎగుమతిని పెంచుకుంది.
5. రోషిణి నాడార్ మల్ హోత్రా
(హెచ్ సీఎల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, సీఈఓ)
హెచ్ సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ ఫౌండర్ శివ్ నాడర్ కూతురు రోషిణి. నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ చదివారు. లండన్ లోని స్కై న్యూస్ లో పనిచేశారు. ప్రస్తుతం హెచ్ సీఎల్ తీసుకనే వ్యూహాత్మక నిర్ణయాల్లో ఈమె భాగస్వామ్యం కూడా ఉంది. హెచ్ సీఎల్ హెల్త్ కేర్ వైస్ ఛైర్మన్ శిఖర్ మల్ హోత్రాను ఈమె పెళ్లి చేసుకున్నారు.
6. ఆదిత్య బర్మన్
(డాబర్ ఇండియా డైరక్టర్)
డాబర్ సంస్థను నడిపిస్తోన్న బర్మన్ కుటుంబానికి చెందిన ఆరవ తరం వ్యక్తి ఆదిత్య. కాన్సస్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ చదివారు ఆదిత్య. ప్రస్తుతం సంస్థ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ లో ఆదిత్య ఒకరు. హిందూస్థానీ క్లాసికల్ సింగర్ శివాని ఈయన భార్య.
7. అష్నీ బియానీ
(ఫ్యూచర్ కంస్యూమర్ మేనేజింగ్ డైరక్టర్)
బిలియనీర్ కిషోర్ బియానీ కూతురు అష్నీ. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో టెక్ట్స్ టైల్ డిజైనింగ్ చదివారు. ప్రస్తుతం ఈమె ఫ్యూచర్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్.
8. కవిన్ భారతీ మిట్టల్
(హైక్ ఫౌండర్, సీఈఓ)
భారతీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ఫౌండర్, ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ కుమారుడు కవిన్ భారతీ. అయితే మిగిలిన అందరి బిలియనీర్ల వారసుల్లా కవిన్ తండ్రి వ్యాపారాన్ని తీసుకోలేదు. కొత్త వ్యాపారాన్ని స్థాపించారు. లండన్ ఇంపీరియల్ కాలేజీలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మేనేజ్ మెంట్ చేశారు. ఆయన 2012లో స్థాపించిన హైక్ 3 ఏళ్లలో దేశంలోనే ఎక్కువ మంది యూజర్స్ ఉన్న కంపెనీగా రికార్డ్ సాధించింది.
9. అనన్య బిర్లా
(సింగర్, స్వతంత్ర మైక్రోఫిన్ ఫౌండర్)
కుమార్ మంగళమ్ బిర్లా పెద్ద కూతురు అనన్య బిర్లా. ఈమె కూడా తన తండ్రి వ్యాపారంలో అడుగుపెట్టడానికి నో చెప్పింది. సింగర్ గా పలు ఆల్బమ్ లకు పాడింది. స్వతంత్ర మైక్రోఫిన్ ను స్థాపించి గ్రామీణ మహిళలకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు ఇప్పిస్తున్నారు.
10. కరణ్ అదానీ
(అదానీ పోర్ట్స్, సెజ్ లిమిటెడ్ సీఈఓ, అదానీ ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ డైరక్టర్)
దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో రెండో వ్యక్తి అయిన గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ. 2009లో తండ్రి వ్యాపారంలో అడుగుపెట్టిన కరణ్.. 2016 నుంచి అదానీ పోర్ట్స్, సెజ్ లిమిటెడ్ కార్యకలాపాలను చూస్తున్నారు.