Sigachi Chemical Explosion | పాశమైలారం ఘటనలో ఆచూకీ దొరకని 8మంది చనిపోయినట్లే | ABP Desam
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సిగాచి కెమికల్స్ లో జరిగిన పేలుడు లో ఇప్పటివరకూ ఆచూకీ దొరకని 8మంది చనిపోయినట్లే అని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ 44మంది చనిపోయిన వారి మృతదేహాల భాగాలను గుర్తించిన అధికారులు..డీఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతుల కుటుంబాలకు వాటిని అందచేశారు. మిగిలిన 8మంది ఆచూకీ తెలియకపోవటంతో శిథిలాల తొలగింపు పూర్తి చేసినా వారి శరీరభాగాలైన లభించకపోవటంతో ఆ 8మంది పూర్తిగా కాలి బూడిదై పోయి ఉంటారని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా 15లక్షలు ఇస్తామన్న అధికారులు...మూడు నెలలలో మిగిలిన ప్రక్రియలు పూర్తి చేసి వారు చనిపోయినట్లు చట్టప్రకారం డెత్ సర్టిఫికేట్లు అందగానే కోటి రూపాయల పరిహారాన్ని అందిస్తామన్నారు. అప్పటి వరకూ మృతుల కుటుంబసభ్యులు 15లక్షలు తీసుకుని వెళ్లిపోవాలని కోరారు. అయితే మృతుని బంధువులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కనీసం తమ వారి అస్థికలు దొరికినా కార్యక్రమాలు చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ డీఎన్ఏ పరీక్షలు పూర్తి చేయటానికి సమయం పడుతుందని అధికారులు సముదాయించే యత్నం చేశారు.





















