Moranchapalli Flood Situation: అన్నీ పోయాయని కన్నీరుమున్నీరు అవుతున్న గ్రామస్థులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మోరంచపల్లిలో.... వరద మిగిల్చిన విషాదం ఇది. వరద తగ్గుముఖం పట్టినా.... దీని నుంచి ఈ గ్రామవాసులు ఇప్పట్లో కోలుకునేలా కనిపించట్లేదు. అన్నీ కొట్టుకుపోయాయి. అంతా ఛిద్రమైపోయింది. దయనీయ పరిస్థితి. జరిగిన విధ్వంసాన్ని చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ గ్రామంలో 250కిపైగా నివాసాలు ఉన్నాయి. 600 మంది ఉంటారు. వరద బాధితులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు గ్రామంలో పర్యటించారు. వారు కనపడగానే గ్రామస్థులు వారిని పట్టుకుని కన్నీటిపర్యంతమయ్యారు. తమ బాధలు చెప్పుకున్నారు. అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే దంపతులు వారికి భరోసా ఇచ్చారు. వరదకు తెగిపోయిన రోడ్డు మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే గండ్ర ఆదేశించారు.





















