Medaram Jatara 3rd Day Specialty | మేడారంలో మూడవ రోజు విశిష్టత ఇదే | ABP Desam
తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర నాలుగు రోజుల పాటు చాలా ఘనంగా జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో మూడవ రోజు అత్యంత పవిత్రమైనది మరియు కీలకమైనది.
జాతరలో మొదటి రోజు సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజులు గద్దెలకు చేరుకోగా.. రెండో రోజు రాత్రి చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపై ప్రతిష్ఠించబడుతుంది. మూడవ రోజున దేవతలందరూ గద్దెలపై కొలువై భక్తులకు పూర్తిస్థాయిలో దర్శనమిస్తారు. తల్లీబిడ్డలు ఇద్దరినీ ఒకేసారి గద్దెలపై దర్శించుకోవడం తమ జన్మ ధన్యమని భక్తులు భావిస్తారు.
ఆ రోజున జాతరలో ప్రధాన ఆకర్షణ భక్తుల మొక్కుబడులు. తమ కోర్కెలు తీర్చిన వనదేవతలకు భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని సమర్పిస్తారు. గద్దెల చుట్టూ కుప్పలు తెప్పలుగా బెల్లం కనిపిస్తుంది. అలాగే ఒడిబియ్యం, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. మూడవ రోజే భక్తుల రద్దీ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కోట్లాది మంది భక్తులు మేడారానికి తరలివస్తారు.




















