మహబూబాబాద్ జిల్లాలో వరదకు కొట్టుకుపోయిన రైలు పట్టాలు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం దగ్గర పరిస్థితి ఇది. వరదల తీవ్రతకు కేసముద్రం వద్ద రైలు పట్టాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. పట్టాల కింద భూమి అనేదే కనపడటం లేదు. గాల్లోకి లేచి కనపడుతున్న ఈ పట్టాల పైకి వెళ్లుంటే పెను ప్రమాదమే జరిగేది. మచిలీపట్నం రైలును ముందుగానే నిలిపివేశారు. మిగిలిన రైళ్లను రద్దు చేశారు. వరద ప్రవాహం తగ్గితే పట్టాల మరమ్మతుల కార్యక్రమం చేపట్టాలని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాకుండా తెలంగాణలో కూడా వర్షాలు బీభత్సం సృష్టించాయి. హైదరాబాద్ సహా తెలంగాణలోని అనేక జిల్లాల్లో వానలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడం బాధాకరం. ముఖ్యంగా ఖమ్మం జిల్లా అయితే వర్షాల కారణంగా మరింతగా నష్టపోయింది. దీంతో అధికార యంత్రాంగం ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా రోడ్డు మార్గంలో ఖమ్మం చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు నేడు అంటే సోమవారం కూడా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.