Kawal Tiger Reserve Villagers Problems | భూమి, పరిహారం కావాల్సిందే..లేదంటే పులి తిరిగే చోటుకే పోతాం | ABP Desam
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంలో పులుల ఆవాసం అభివృద్ధి చేయడంలో భాగంగా నిర్మల్ జిల్లాలోని మైసంపేట రాంపూర్ గ్రామాలను అధికారులు ఖాళీ చేయించి.. వారికి కొత్త మద్దిపడగ గ్రామంలో పక్కా గృహాలు నిర్మించి పునరావాసం కల్పించారు. పునరావాసం కల్పించి ఏడాది గడిచినప్పటికీ ఇంకా వారికి ఇచ్చిన హామీ ప్రకారం సాగుభూమితోపాటు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వలేదని, అక్కడ ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక కొట్టుమిట్టాడుతున్నామని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా, పట్టించుకోవడంలేదని మళ్ళీ తమ పాత గ్రామాల్లోకి వెళ్లి గుడిసెలు వేశారు. పునరావాస గ్రామస్తులు అడవిలో పాత గ్రామాల్లో గుడిసెలు వేయడానికి గల ప్రధాన కారణమేంటి..? ఇంకా వారు ఏం డిమాండ్ చేస్తున్నారు..? ABP Desam స్పెషల్ స్టోరీలో చూద్దాం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంలో పులుల ఆవాసం కోసం అధికారులు ప్రత్యేకంగా నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేట, రాంపూర్ ఈ రెండు గ్రామాలను గత ఏడాది ఖాళీ చేయించారు. దట్టమైన అటవీ ప్రాంతం ఉండడంతో పులులకు ఆవాసయోగ్యాంగా ఈ ప్రాంతం ఉంది. నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ ఈ నాలుగు జిల్లాల సరిహద్దులో మధ్యలో ఈ ప్రాంతం ఉంది. మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతం నుండి కాగజ్ నగర్ కారిడార్ మీదుగా కవ్వాల్ అభయారణ్యంలోకి ఇప్పుడు రాకపోకలు కొనసాగుతుంటాయి. మరోపక్క మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ ఆభయారణ్యం నుండి పెన్ గంగా నది దాటి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు గుండా కవ్వాల్ అభయారణ్యంలోకి పులులు వస్తూపోతూ ఉంటాయి. దీంతో ఈ ప్రాంతం పులులకు ఆవాస కేంద్రంగా ఉండాలని అడవుల్లో ఉండే గ్రామాలను ఖాళీ చేయించేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే గత ఏడాది రాంపూర్ మైసంపేట గ్రామాల ప్రజలను ఆ గ్రామం ని వదిలి పునరవాసం కల్పించిన గ్రామంలోకి వెళ్లే దిశగా అధికారులు ఏర్పాటు చేయగా.. పునరవాసంలో పక్కా గృహాలు, స్పెషల్ ప్యాకేజ్ కింద 15లక్షలు పరిహారం, అదేవిధంగా మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు తమ గ్రామాన్ని వదిలి పునరావాస గ్రామానికి వెళ్లి స్థిరపడ్డారు. పునరావాస గ్రామంలో ఉండి ఏడాది గడిచిన తమకు ఎలాంటి పరిహారం అందలేదని, భూమి ఇవ్వలేదని దిక్కుతోచనీ స్థితిలో తాము ఉపాధి లేక కూలినాలీ చేసుకుంటూ బతుకుతున్నామని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు అటవీ శాఖ అధికారులకు, ఎమ్మెల్యేలకు జిల్లా కలెక్టర్లకు చెప్పిన తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని, తమకు రావలసిన స్పెషల్ ప్యాకేజీ పరిహారం, అలాగే సాగుచేసుకునేందుకు భూమి కూడా ఇవ్వడం లేదని, ఏడాది నుండీ సరైన ఉపాధి లేక తాము తల్లడిల్లుతున్నామని ఏబీపీ దేశంతో వారి గోడును వెళ్లగక్కారు.





















