Gadwal Surveyor Murder Case | గద్వాల్ సర్వేయర్ హత్య కేసులో వెలుగు చూస్తున్న సంచలన విషయాలు | ABP Desam
గద్వాల జిల్లాలో ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తేజేశ్వర్ ను తన భార్య నే ప్రియుడితో కలిసి మర్డర్ చేయించిన విధానమే కలకలం రేపుతుందనుకుంటే...ఈ కేసులో కీలక నిందితుడు బ్యాంకు మేనేజర్ అయిన తిరుమల రావు తన భార్యను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడన్న వార్త ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.
గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ నెలరోజుల క్రితం ఐశ్వర్య అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే వివాహానికి ముందు ఓ పెద్ద ఎపిసోడ్ జరిగింది. పెళ్లి కూతురుగా పీటల మీద కూర్చుకోవాల్సిన ఐశ్వర్య కనిపించకుండా వెళ్లిపోయింది. దీంతో పెళ్లి రద్దు చేసుకోవాలని భావించగా ఈ లోగా ఏం జరిగిందో తిరిగొచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్ నే పెళ్లి చేసుకుంటానని గోలగోల చేసింది. ఏడ్చి గగ్గోలు పెట్టడంతో తేజేశ్వరే తన తల్లితండ్రులను కూడా నచ్చచెప్పి ఐశ్వర్యను పెళ్లి చేసుకోగా..నెలరోజుల్లోనే శవమై గాలేరు నగరి కాలువలో కనిపించాడు.
బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తున్న తిరుమల రావు అనే వ్యక్తికి ఐశ్వర్య తల్లితో సంబంధం ఉంది. ఆ పరిచయం కాస్తా తిరుమల రావు, ఐశ్వర్య ల మధ్య అక్రమ సంబంధం ఏర్పడటానికి కారణమైందని..ఫలితంగా అడ్డు వచ్చిన తేజేశ్వర్ రావును తప్పించుకోవాలనే తనను చంపేసినట్లు పోలీసుల ఎదుట ఐశ్వర్య అంగీకరించింది. చంపేయాలనుకున్నప్పుడు, అడ్డు అనుకున్నప్పుడు అసలు తేజేశ్వర్ రావును ఎందుకు పెళ్లి చేసుకున్నావని అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం రావట్లేదు. ఆస్తి కోసం చేసుకుందని కొందరు..తిరుమల రావుతో తన బంధం కొనసాగాలంటే తేజేశ్వర్ లాంటి అమాయకుడు కావాలని పెళ్లి చేసుకుందని మరికొందరు చెబుతున్నారు.
తల్లి కూతుళ్లతో సంబంధం పెట్టుకుని..మనుషులకు సుపారీ ఇచ్చి తేజేశ్వర్ రావును తిరుమలరావు చంపించేశాడని..అందుకోసం ముగ్గురు వ్యక్తులకు రెండు లక్షలు చెల్లించాడని..పోలీసులు తేల్చారు. తేజేశ్వర్ రావు మృతదేహం గాలేరు నగరి కాలువలో దొరకగా..అసలు విషయం అంతా వెలుగుచూసింది. అయితే తాజాగా ఈ కేసులో బయటపడిన ట్విస్ట్ ఏంటంటే...తిరుమల రావు కూడా ఐశ్వర్య కోసం తన భార్యను చంపేయాలని ప్లాన్ చేశాడట. అయితే తమ బంధువుల దగ్గర పేరు పోతుందనే భయంతోనే ఆగిపోయాడని తెలుస్తోంది. పోలీసులు తిరుమల రావు కోసం గాలిస్తుండగా...ఐశ్వర్యను, ఆమె తల్లిని అరెస్ట్ చేశారు.





















