Rahane's Grit Despite Stitches | కేకేఆర్ ను ప్లే ఆఫ్స్ కు తీసుకువెళ్లటం సర్వస్వం పెట్టేస్తున్న రహానే | ABP Desam
కోల్ కతా నైట్ రైడర్స్ కు ఈ సీజన్ లో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న అజింక్యా రహానే తన టీమ్ ను ప్లే ఆఫ్స్ కి తీసుకువెళ్లేందుకు సర్వస్వం పెట్టేస్తున్నాడు. గతేడాది ఛాంపియన్స్ జట్లు శ్రేయస్ అయ్యర్ మినహా ఆల్మోస్ట్ అలానే ఉన్నా ఎందుకో ఈసారి ఘోరంగా విఫలమైంది. నరైన్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రస్సెల్ లాంటి వాళ్లు సీజన్ మొదట్లో అనుకున్నంత స్థాయిలో రాణించకపోవటంతో కోల్ కతా కు పరాజయాలు తప్పలేదు. ఇప్పుడు సీజన్ చివరికి వచ్చేసరికి ప్లే ఆఫ్స్ ఆశల కోసం పోరాడుతోంది. ఇన్ని ప్రతికూలతల మధ్య కోల్ కతాకు కనిపిస్తున్న ఏకైక అనుకూలత కెప్టెన్ అజింక్యా రహానే. ఆటలో గాయపడి రహానే చేతికి కుట్లు వేశారు. సాధారణంగా ఏ ఆటగాడైనా తన కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని ఎంత కెప్టెన్ అయినా పక్కకు తప్పుకుంటారు. రాజస్థాన్ కు సంజూ శాంసన్ అదే చేశాడు కదా. కానీ రహానే అలా కాదు కుట్లు వేయించుకున్నా సరే అదే చేత్తో ఆడేస్తున్నాడు. బ్యాటింగ్ చేసేస్తున్నాడు. ఎందుకంటే తనను నమ్మి బాధ్యత అప్పగించిన కేకేఆర్ కు సాధ్యమైనంత వరకూ తను ఉపయోగపడాలి అనుకుంటున్నాడు రహానే. నిన్న చేతికి అన్ని కుట్లు కట్లు ఉన్నా వైభవ్ సూర్యవంశీ లాంటి చిచ్చరపిడుగు ఇచ్చిన క్యాచ్ ను అమాంతం దూకి పట్టుకున్న రహానే..తన డెడికేషన్ ఏంటో చూపించాడు. బ్యాటింగ్ లోనూ అంతే ఈ సీజన్ లో కోల్ కతా తరపున 327 పరుగులు చేసిన రహానే అందులో 3 హాఫ్ సెంచరీలు బాదాడు.కేకేఆర్ తరపున హయ్యెస్ట్ స్కోరర్ రహానేనే. ఇటు కెప్టెన్సీలో తనదైన శైలిలో చూపిస్తూ నిన్న రాజస్థాన్ పై ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ గెలవటం ద్వారా ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచగలిగాడు. ప్రస్తుతం 11 మ్యాచుల్లో 11 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది కోల్ కతా. ఇక దక్షిణాది దండయాత్ర మొదలు పెట్టాలి రహానే. సీఎస్కే, ఆర్సీబీ, SRH లపై తమకున్న మూడు మ్యాచ్ లు గెలిచేస్తే 17 పాయింట్లతో దర్జాగా కేకేఆర్ ప్లే ఆఫ్స్ కి వెళ్లిపోవచ్చు. ప్రస్తుతం రహానే టార్గెట్ అదే. అందుకే తనకు గాయమైనా టీమ్ కోసం గుండె ధైర్యంతో ఆడేస్తున్నాడు.



















