Sajid Khan Nomal Ali vs England | రెండు టెస్టుల్లో 39వికెట్లు తీసి బజ్ బాల్ ను సమాధి చేశారు | ABP
టెస్ట్ క్రికెట్ ను దూకుడుకు కేరాఫ్ అడ్రస్ గా మారుస్తూ బాజ్ బాల్ అనే విధానంతో ఇంగ్లండ్ దూసుకెళ్తోంది. దీనివల్ల లాభమొచ్చినా నష్టమొచ్చినా ఇంగ్లండ్ తమ ఆటతీరు మాత్రం మార్చుకోవటం లేదు. అలానే పాకిస్థాన్ కు వచ్చింది. ముల్తాన్ లో జరిగిన మొదటి టెస్టులో సిమెంట్ రోడ్డు లాంటి పిచ్ మీద పరుగుల ప్రవాహం పారించింది. హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీ, జో రూట్ భారీ డబుల్ సెంచరీతో ముల్తాన్ మొదటి టెస్టును ఇన్నింగ్స్ తేడాతో గెలుచుకున్న ఇంగ్లండ్..రెండు మూడు టెస్టుల్లో ఊహించని రీతిలో బొక్క బోర్లా పడింది. కారణం ఈ ఇద్దరు పాకిస్థాన్ స్పిన్నర్లే. ఒకడి పేరు సాజిద్ ఖాన్. వయస్సు 32ఏళ్లు. వికెట్ తీసి గ్రౌండ్ లో తొడకొడతాడు. మరొకడి పేరు నోమన్ అలీ. 38ఏళ్లు. వికెట్ తీసి చిలిపి నవ్వు నవ్వుతాడు. ఒకడు వికట్టహాసంతో మరొకడు మందహాసంతో అటు ముల్తాన్ లోనూ ఇటు రావల్పిండిలోనూ బజ్ బాల్ క్రికెట్ ను సమాధి చేసేశారు. ఎంతెలా అంటే పాకిస్థాన్ తో అసలు వీళ్లిద్దరితో తప్ప మరో బౌలర్ తో బౌలింగ్ కూడా చేయించలేదు. ఫాస్ట్ బౌలర్లైతే అసలు ఉన్నారని కూడా గుర్తించలేదు. రెండు టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్ లో 40 వికెట్లు ఉంటాయి. మొత్తం 39 వికెట్లు వీళ్లిద్దరే తీశారు. ఓ ఇన్నింగ్స్ లో నోమన్ అలీ 7-8 తీస్తో సాజిద్ రెండో మూడో అంటాడు. మళ్లీ రివర్స్ ఈ సారి సాజిద్ ఆరు వికెట్లు అంటే నోమన్ అలీ నాలుగు వికెట్లు అంటాడు. అలా వీళ్లిద్దరే వికెట్లను పంచుకుంటూ వేటాడుతూ ...ఇంగ్లండ్ ను ఊహించని రీతిలో పరాజయాన్ని పరిచయం చేసి నాలుగేళ్ల తర్వాత పాకిస్థాన్ కు హోం గ్రౌండ్ లో సిరీస్ విజయాన్ని అందించారు. లేటు వయస్సులో పాకిస్థాన్ జట్టులోకి వచ్చినా అప్పట్లో పాకిస్థాన్ క్రికెట్ ను పీక్స్ లోకి తీసుకువెళ్లిన వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్ ఫాస్ట్ బౌలింగ్ లెజెండ్స్ తో వీళ్లను పోలుస్తున్నారు. వీళ్లిద్దరూ స్పిన్ దిగ్గజాలుగా మారి పాకిస్థాన్ క్రికెట్ దశదిశను మారుస్తారేమో చూడాలి.