SA vs Aus WTC 2025 Final Day 4 Highlights | చరిత్రలో తొలిసారిగా మేజర్ ఐసీసీ టైటిల్ నెగ్గిన సౌతాఫ్రికా | ABP Desam
సౌతాఫ్రికన్ క్రికెట్ లో అద్భుతం ఆవిష్కృతమైంది. ఇన్నాళ్లూ చోకర్స్ చోకర్స్ అంటూ పిలిచిన నోళ్లన్నీ మూసుకునేలా..చోకర్స్ కాదు తాము ఛాంపియన్స్ అంటూ నిరూపిస్తూ ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ 2025 ను సగర్వంగా కైవసం చేసుకుంది సౌతాఫ్రికా. లార్డ్స్ లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ లో కెప్టెన్ తెంబా బవుమా తో కలిసి అద్భుతమైన పార్టనర్ షిప్ పెడుతూ.. సెంచరీతో కదం తొక్కిన ఏడెన్ మార్ క్రమ్ సౌతాఫ్రికా తొలి ఐసీసీ మేజర్ టైటిల్ ను అందించాడు. అద్భుతమైన సెంచరీతో కంగారూలు విధించిన 282 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 5 వికెట్లు నష్టపోయి ఛేదించింది. బౌలర్ల ఆధిపత్యమే సాగిన ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ ఇచ్చిన లక్ష్యాన్ని చేధించేందుకు కెప్టెన్ బవుమాతో కలిసి మార్ క్రమ్ అద్భుత పోరాటం చేయటంతో చారిత్రక విజయం ఆవిష్కృతమైంది. సౌతాఫ్రికా చరిత్రలో ఇదే తొలి ఐసీసీ మేజర్ టైటిల్. ఏడెన్ మార్ క్రమ్ 207 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లతో 136 పరుగులు సాధించి విజయానికి 6 పరుగుల ముందు ఔట్ అయ్యాడు. మార్ క్రమ్ కి మర్చిపోలేని సహకారం అందించిన కెప్టెన్ తెంబా బవుమా 134 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతో 66పరుగులు చేశాడు. డేవిడ్ బెడింగ్ హమ్ చివర్లో ఓపికగా నిలబడి విజయానికి కావాల్సిన పరుగులను పూర్తి చేసి ఆసీస్ వికెట్ల తేడాతో సౌతాఫ్రికాకు విజయాన్ని అందించాడు. ఈ టెస్టులో తొమ్మిది వికెట్లు తీసిన కాగిసో రబాడా ఆసీస్ పతనాన్ని శాసించగా..1998లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీ గెలిచిన తర్వాత సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మేజర్ ఐసీసీ టైటిల్ ను కైవసం చేసుకుంది సౌతాఫ్రికా.





















