Rahul Dravid Aggressive Celebrations | కెప్టెన్ గా సాధించలేని దాన్ని కోచ్ గా సాధించుకున్న ద్రవిడ్
రాహుల్ ద్రవిడ్. ఎవరైనా ఈ పేరు చెప్పగానే ఓ ప్రశాంతమైన రూపం మన కళ్లముందు కదులుతుంది. 90స్ లో పుట్టిన వాళ్లకు రాహుల్ ద్రవిడ్ అంటే ఓ జెంటిల్మన్. ఎప్పుడూ ఓ చిన్న స్మైల్ తో మిస్టర్ డిపెంబడుబుల్ బ్యాటర్ గా తర్వాత కీపర్ గా తర్వాత కెప్టెన్ గా చేసిన ఓ మిస్టర్ కూల్ గుర్తొస్తాడు. కానీ ఇది నిన్న. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ కూడా ఇంత అగ్రెసివ్ గా సెలబ్రేట్ చేసుకుని ఉండరు. రాహుల్ ద్రవిడ్ మాత్రం రచ్చ రచ్చ చేశాడు. వరల్డ్ కప్ పట్టుకుని దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. దీనికో రీజన్ ఉంది. టెస్టులు, వన్డేల్లో ఆల్ టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకరైన రాహుల్ ద్రావిడ్ తను ఆడినంత కాలం వరల్డ్ కప్ ను ఆటగాడిగా సాధించలేకపోయాడు. 2003 వరల్డ్ కప్ లో ఫైనల్లో ఓడిపోయిన ద్రవిడ్...2007వరల్డ్ కప్ కి టీమిండియాకు కెప్టెన్ గానూ వ్యవహరించాడు. అయితే భారత క్రికెట్ చరిత్రలో ఘోరమైన పరాజయాలను 2007లో వరల్డ్ కప్ లో ఎదుర్కొంది భారత్. ఆఖరికి బంగ్లాదేశ్ చేతిలో కూడా ఓడిపోయి టీమిండియా చెత్త ప్రదర్శనతో టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత కెప్టెన్సీని ధోనిని లాంటి కుర్రాడికి వదిలేసిన రాహుల్ ద్రవిడ్...ఆఖరుకు ప్రపంచకప్ లేకుండానే రిటైర్ అయ్యాడు. ఇప్పుడు టీమిండియా కోచ్ అయిన తర్వాత ఎట్టకేలకు తన ప్రపంచకప్ కలను నెరవేర్చుకున్నాడు. గడచిన రెండేళ్లలో మూడోసారి టీమిండియా ఫైనల్ కి చేరటంలో కీలకపాత్ర కోచ్ రాహుల్ ద్రవిడ్ ది. 2023 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను ఫైనల్లో ఓడిపోయినా..2023 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయినా...నిరుత్సాహ పడకుండా ఏడాది తిరిగే లోపు 2024 టీ20 వరల్డ్ కప్ లో మళ్లీ కసితీరా కలబడ్డారు. ఇప్పుడు విశ్వవిజేతగా సగర్వంగా ప్రపంచం ముందు నిలబడ్డారు. అందుకే ద్రవిడ్ లో ఎక్కడాలేని అగ్రెషన్ కనపడింది. కొహ్లీ పిలిచి ట్రోఫీ ఎత్తాలని ద్రవిడ్ ను గౌరవిస్తే ఏ మాత్రం మొహమాటపడుకుండా ఫుల్ ఓపెన్ అయిపోయి కుర్రాళ్లతో కలిసి అరుస్తూ రచ్చ రచ్చ చేశాడు. తర్వాత ఫోటోలు దిగేప్పుడు కూడా పాండ్యా పక్కన కూర్చుని అరుస్తూ ఇదే రేంజ్ ఎమోషన్ ను చూపించిన ద్రవిడ్ తన ప్రపంచకప్ కలను ఆటగాడిగా సాధించలేకపోయినా..కోచ్ గా సాధించి కసితీరా ఎంజాయ్ చేశాడు.