Ind vs Ban First Test Result | బంగ్లా పులులను పరుగులుపెట్టించిన చెన్నై చిరుత | ABP Desam
పాకిస్థాన్ ను పాకిస్థాన్ లోనే కొట్టేశాం. అదే దూకుడులో ఇండియాను వణికించేద్దాం అనుకున్నాయి బంగ్లాపులులు. చెన్నైలో దిగి దిగగానే మొదటి రోజైతే రెచ్చిపోయాయి. మన టాప్ బ్యాటర్లు అంతా తోక ముడిస్తే ఒక్కడు మాత్రం అడ్డు పడ్డాడు. బంగ్లా ఆశలను చెన్నై ఎండల్లో ఆలూ ఫ్రై చేసేశాడు. అవుటాఫ్ సిలబస్ లా బ్యాట్ తో చావగొట్టి చెవులు మూసి తమ్ముడు ఆల్ రౌండర్ అమ్మా అన్నాడు. ఇప్పుడు అతనే సెకండ్ ఇన్నింగ్స్ లో బాల్ తో రప్ఫాడించి...మీరు గెలిచేయటానికి నేనేమన్నా బాబర్ ఆజమ్ అనుకుంటున్నారేంట్రా చెన్నై చిరుత అని చాటి చెప్పాడు. ఎస్ రవి చంద్ర అశ్విన్ మేనియా లో సాగిన మొదటి టెస్టు ను టీమిండియా 280పరుగుల తేడాతో గెలుచుకుంది. మొదటి రోజు మొదటి ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటర్లను కాస్త వణికించటం తప్ప మరేం చేయలేకపోయిన ఈ టెస్టులో భారత్ విసిరిన 515పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక 234పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొదటి ఇన్నింగ్స్ లో అశ్విన్ కి తోడుగా ఉండి బ్యాట్ తో అదరగొట్టిన జడ్డూ...సెకండ్ ఇన్నింగ్స్ లో అదే అశ్విన్ తోడుగా నిలబడ్డాడు. అశ్విన్ ఆరువికెట్లు తీస్తే..జడ్డూ మూడు వికెట్లు తీసి బంగ్లా పులులను తోక ముడిచేలా చేశారు. యాష్ అన్న ఊర మాస్ మ్యాజిక్ చేస్తూ కెరీర్ లో 37వసారి 5వికెట్ల ప్రదర్శన చేశాడు. అంతే కాదు టోటల్ గా 522 టెస్టు వికెట్లతో ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ కోట్నీ వాల్ష్ వికెట్ల రికార్డును దాటేశాడు. టాప్ 8 టెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. మరో 8టెస్టు వికెట్లు కనుక ఆశ్విన్ తీసుకుంటే నాథన్ లయన్ ను వెనక్కి నెట్టి హయ్యెస్ట్ టెస్ట్ వికెట్ టేకర్స్ జాబితాలో ఏడోస్థానాన్ని సాధిస్తాడు.