Aus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పై ఏమాత్రం ఆశలు ఉండాలన్నా కచ్చితంగా గెలిచి తీరాల్సిన సిడ్నీ టెస్టును టీమిండియా పేలవంగా ప్రారంభించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ లో సిరీస్ లో ఆఖరి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది టీమిండియా. ఓటములకు కారణంగా చూపిస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ మీద తీవ్రమైన ఒత్తిడి రాగా...తనంతట తానే మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు హిట్ మ్యాన్. కెప్టెన్ గా జస్ ప్రీత్ బుమ్రా నేతృత్వంలో భారత్ కాన్ఫిడెంట్ గానే దిగినా...తరరాత మాత్రం మారలేదు. రిషభ్ పంత్, రవీంద్ర జడేజా మిగిలిన బ్యాటర్ల నుంచి కనీస పోరాటం కరువైంది. రోహిత్ స్థానంలో జట్టులోకి వచ్చిన గిల్ 20 పరుగులతో కాసేపు క్రీజులో నిలబడినా...జైశ్వాల్, కేఎల్ రాహుల్, కొహ్లీ, మెల్ బోర్న్ సెంచరీ హీరో నితీశ్ రెడ్డి తీవ్రంగా నిరాశపరిచారు. కొహ్లీ 17పరుగులకే అవుటవగా...నితీశ్ రెడ్డి మొదటిబంతికే డకౌట్ గా వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా పేస్ అటాక్ ను ఎదుర్కొంటూ..తీవ్రంగా దెబ్బలు తింటూ పంత్ క్రీజ్ లో పోరాడేందుకు ప్రయత్నించాడు. బోలాండ్ 4, స్టార్క్ 3, కమిన్స్ 2, లయన్ 1 వికెట్ తీయటంతో భారత్ 185పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ ను బుమ్రా భయపెట్టాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ ఆఖరి బంతికి ఆసీస్ ఓపెనర్ ఖవాజాను ఔట్ చేశాడు కెప్టెన్ బుమ్రా. ఫలితంగా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి తొమ్మిది పరుగులతో ఉంది. భారత బౌలర్లు కూడా విజృంభించి ఆసీస్ ను తక్కువ పరుగులకు అవుట్ చేస్తే కానీ సిడ్నీ టెస్టులో భారత్ కోలుకోవటం కష్టం అవనుంది.