వయనాడ్‌లో ప్రియాంక గాంధీకి పోటీగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
వయనాడ్ ఎంపీ బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తరవాత అక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి. ఇప్పటికే కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని పార్టీ ప్రకటించడం ఆసక్తి రేకెత్తించింది. అటు బీజేపీ ప్రియాంకకు ప్రత్యర్థిగా ఎవరిని నిలబెడుతుందన్న ఉత్కంఠకు తెర దించుతూ ఓ పేరు ప్రకటించింది. ఇప్పుడా పేరే సోషల్ మీడియాలో గట్టిగా వినబడుతోంది. ఆమె పేరు నవ్యా హరిదాస్. వయనాడ్‌లో ప్రియాంక గాంధీకి గట్టి పోటీ ఇచ్చేందుకు బరిలోకి దిగుతున్నారీ 39 ఏళ్ల నవ్య. ఇంజనీరింగ్ చదివిన ఈమె...పాలిటిక్స్‌పై ఇంట్రెస్ట్‌తో రాజకీయాల్లోకి వచ్చారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసి ఆ తరవాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మోదీ ఐడియాలజీ నచ్చి బీజేపీకి దగ్గరయ్యారు. కేరళలో బీజేపీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీగా పని చేశారు. 2021లో కొజికోడ్ నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు నవ్యా హరిదాస్. కొజికోడ్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా రెండు సార్లు గెలిచారు. ఈ రాజకీయ అనుభవంతోనే ఈ సారి ఏకంగా ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌కి కంచుకోటగా ఉన్న వయనాడ్‌లో కచ్చితంగా గెలిచి తీరతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు నవ్యా హరిదాస్. గాంధీ కుటుంబానికి వయనాడ్ అనేది ఓ ఛాయిస్ మాత్రమే అని అప్పుడే విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికే సురేశ్ గోపీ ఎంపీగా గెలిచి బీజేపీకి కేరళలో ఖాతా తెరిచారు. ఇప్పుడు నవ్యా హరిదాస్ కూడా గెలిస్తే..మెల్లగా ఈ రాష్ట్రంలో బీజేపీ ఉనికి చాటుకునే అవకాశముంది.