Player slams Punjab Govt:నా ఆశలు గల్లంతేనా..?
పంజాబ్ కు చెందిన బధిర చెస్ ప్లేయర్ మలికా హండా ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు. అనేక జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో ఎన్నో పతకాలు సాధించిన ఈమె... తనకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పంబాబ్ ప్రభుత్వం విఫలమైందని తన బాధను వెళ్లగక్కారు. తాను సాధించిన మెడల్స్ ను చూపిస్తూ తన సమస్యలను ఓ వీడియో ద్వారా తెలియచేశారు. తన సైగల అర్థాన్ని వీడియో పక్కన ఓ నోట్ రూపంలో జత చేశారు. "నాకు చాలా బాధగా ఉంది. డిసెంబర్ 31న పంజాబ్ క్రీడాశాఖ ప్రస్తుత మంత్రి పర్గత్ సింగ్ ను కలిశాను. బధిర క్రీడాకారులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వలేమన్నారు. అలాంటి విధానమే లేదన్నారు. క్రీడాశాఖ పూర్వ మంత్రి తనకు నగదు ప్రోత్సాహకం సహా అనేక హామీలు ఇచ్చారని నేను చెప్పాను. అది ఆయన చెప్పిన విషయమని, మేం ఏం చేయలేమని తేల్చిచెప్పేశారు. గతంలో హామీ ఇచ్చారు కాబట్టే నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకుని ఐదేళ్లు వృథా చేశాను. బధిర క్రీడాకారులను వారు అసలు పట్టించుకోరు" అంటూ మలికా హండా తన గోడు వెళ్లబోసుకున్నారు. ట్విట్టర్ లో మలికా హండాకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. పంజాబ్ ప్రభుత్వం ఆదుకోలేకపోతే ఈ ప్రతిభావంతురాలికి మనం సాయంగా నిలుద్దామంటూ పిలుపునిస్తున్నారు.