Jagdeep Dhankhar resigned as Vice President | ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా
రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ పదవీకాలం 2027 వరకు ఉంది. కానీ అనారోగ్య కారణాల వల్ల అకస్మాత్తుగా తన పదవీ కాలాన్ని ముగిస్తూ రాజీనామా చేసారు. ఉపరాష్ట్రపతి తన పదవీకాలం మధ్యలో రాజీనామా చేస్తే, ఆ పదవి బాధ్యతను తాత్కాలికంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ నిర్వర్తిస్తారు. ఆయనే రాజ్యసభలో సమావేశాలను కూడా నిర్వహిస్తారు. డిప్యూటీ చైర్మన్ కూడా లేకపోతే రాజ్యసభ సభ్యులు 'వైస్ చైర్మన్ల ప్యానెల్'లో సీనియర్ సభ్యుడిని ఎన్నుకోవచ్చు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం 2022లో ముగిసిన తర్వాత కొత్త ఉపాధ్యక్షుదిగా జగదీప్ ధన్ ఖడ్ ఎన్నికయ్యే వరకు రాజ్యసభను డిప్యూటీ చైర్మన్ , వైస్ చైర్మన్ ప్యానెల్ నిర్వహించింది.
ఇప్పటి వరకు ఉప రాష్ట్రపతి పదవికి ఇలా అనారోగ్య కారణాలతో రాజీనామా చేసిన వారు లేరు. ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత చాలామంది తమ ఉప రాష్ట్రపతి పదవులకు రాజీనామా చేసారు. తమ పదవి కాలాన్ని ముగించకుండానే రాజీనామా చేసిన మూడవ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్. అంతకంటే ముందు VV గిరి, భైరాన్ సింగ్ షెఖావత్ తమ పదవీకాలాన్ని పూర్తి చేయకుండా రాజీనామా చేసారు. జాకీర్ హుస్సేన్ మరణం తర్వాత ఉపాధ్యక్షుడు VV గిరి రాజీనామా చేసి ఎన్నికల్లో గెలిచి నాల్గవ రాష్ట్రపతి అయ్యారు. పదవీకాలం పూర్తికాని తొలి ఉపరాష్ట్రపతి కూడా గిరినే. అలాగే రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ఉప రాష్ట్రపతి పదవులకు ఆర్ వెంకటరామన్, శంకర్ దయాళ్ శర్మ, కెఆర్ నారాయణన్ రాజీనామా చేశారు.





















