Gujarat Former CM Vijay Rupani in Plane Crash | కూలిపోయిన విమానంలో విజయ్ రూపానీ | ABP Desam
అహ్మదాబాద్ లో విమానం కుప్పకూలిన ప్రమాదం జరిగినప్పుడు ఫ్లైట్ లో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. తన కుమార్తెను కలవటం కోసం విజయ్ రూపాని లండన్ వెళ్తుండగా ఈ విమాన ప్రమాదం జరిగింది. విజయ్ రూపాని విమానంలో ఉన్న విషయాన్ని ఆయన విమాన ప్రయాణ టిక్కెట్లు, డీజీసీఏ విడుదల చేసిన ప్రయాణికుల జాబితా స్పష్టం చేస్తున్నాయి. 2016 నుంచి 2021 వరకూ ఐదేళ్ల పాటు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. మయన్మార్ లో ఓ భారతీయ కుటుంబంలో జన్మించారు విజయ్ రూపాని. తర్వాత గుజరాత్ కి తిరిగి వచ్చి స్టూడెంట్ లీడర్ గా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఏబీవీపీ, ఆరెఎస్ఎస్ కార్యకర్త గా పనిచేసిన రుపానీ 1971లోజన్ సంఘ్ లో చేరటం ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా బీజేపీ అధిష్టానానికి నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న రుపానీని ప్రధాని మోదీ ఏరి కోరి గుజరాత్ ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. ఆయన విమాన ప్రమాదం జరిగినప్పుడు అందులో ఉండటంతో ఆయన కుటుంబం, బీజేపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.





















