Sitaram Yechury Political Journey | విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేసిన సీతారాం ఏచూరి | ABP Desam
సీపీఎమ్ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కన్ను మూశారు. చాన్నాళ్లుగా ఆయన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడుతున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. దాదాపు 2015లో సీపీఎమ్ జాతీయ కార్యదర్శిగా ఎంపికైన సీతారాం...అప్పటి నుంచి అదే పదవిలో కొనసాగుతున్నారు. 1952లో ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు సీతారాం ఏచూరి. పుట్టింది చెన్నైలోనే అయినా ఆయన పెరిగింది హైదరాబాద్‌లోనే. పదో తరగతి వరకూ హైదరాబాద్‌లోనే చదువుకున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ కాకినాడ వాళ్లే. తండ్రి సర్వేశ్వర సోమయాజులు అప్పటి ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో ఇంజనీర్‌గా పని చేశారు.
1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఢిల్లీ వెళ్లారు. అక్కడే ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్‌లో చేరారు. 1970లో CBSEలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఆ తరవాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు. JNU నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ సంపాదించారు. పీహెచ్‌డీ చేసే సమయంలోనే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. అప్పుడే అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించారు.
1974లో SFI సభ్యుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు సీతారాం ఏచూరి. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థిగా ఉండగానే CPMలో చేరారు. JNU స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా మూడు సార్లు ఎంపికయ్యారు. సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్ కలిసి JNUలో వామపక్ష భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లారు. 1978లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఆ తరవాత ప్రెసిడెంట్‌గానూ చేశారు.