సునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్
వారం రోజుల్లో తిరిగి తీసుకువచ్చేలా సునీతా విలియమ్స్, విల్ మోర్ లను తీసుకుని జూన్ 5న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్...మూడు నెలల తర్వాత సునీతా, విల్ మోర్ లేకుండానే భూమ్మీదకు తిరిగి వచ్చింది. సునీతా, విల్ మోర్ బయల్దేరే ముందు స్పేస్ క్రాప్ట్ థ్రస్టర్స్ లో హీలియం లీక్ అవుతున్నట్లు గమనించటంతో నాసా వ్యోమగాములను భూమి మీదకు స్టార్ లైనర్ లో వచ్చేందుకు అంగీకరించలేదు. సుదీర్ఘ ఉత్కంఠ తర్వాత స్పేస్ ఎక్స్ క్రూ 9ను ప్రయోగించి..అందులో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీతాను, విల్ మోర్ ను భూమి మీదకు తీసుకురావాలని నాసా ఫిక్స్ అయ్యింది. తమకు ఓ ఛాన్స్ ఇవ్వాలని బోయింగ్ సంస్థ ఎంత బతిమాలినా నాసా అందుకు అంగీకరించ లేదు. చేసేది ఏం లేని పరిస్థితుల్లో నిన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి అన్ డాక్ అయిన స్టార్ లైనర్...భూమ్మీద మనుషులు లేకుండానే ల్యాండ్ అయ్యింది. అయితే ఎలాంటి ప్రమాదం లేకుండా స్టార్ లైనర్ ల్యాండ్ అవటం ఇక్కడ గమనించాల్సిన అంశం. కానీ నాసా బోయింగ్ లో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా వాళ్లతో డీల్ రద్దు చేసుకునేలా ఉంది. అదే జరిగితే బోయింగ్ సంస్థ దాదాపుగా 16వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవి చూడాల్సి ఉంది.