ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం, గోల్ఫ్‌కోర్ట్ సమీపంలో కాల్పులు
అమెరికా ప్రెసిడెంట్ రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై ఆ మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటన సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి భారీ భద్రత మధ్య ట్రంప్ ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే..మరోసారి ట్రంప్‌కి సమీపంలోనే కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలోని గోల్ఫ్‌కోర్టులో గోల్ఫ్ ఆడుతుండగా అక్కడికి దగ్గర్లోనే గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ ఆయనను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు ఓ గన్‌ని స్వాధీనం చేసుకున్నారు. అయితే...ఈ కాల్పులు ఎందుకు జరిపారన్నది ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై ట్రంప్ కొడుకు ట్వీట్ చేశాడు. మరోసారి కాల్పులు జరిగాయని, ట్రంప్ సేఫ్‌గా ఉన్నారని పోస్ట్ పెట్టాడు. అమెరికాలో ఇలాంటి హింసకు తావు లేదని ప్రెసిడెంట్ జో బైడెన్ తేల్చి చెప్పారు. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ పోటీ పడుతున్నారు. అంతకు ముందు ఈ రేసులో ఉన్న బైడెన్..వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నారు.