Telangana DOST 2021: నోటిఫికేషన్ విడుదల.. సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు
తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ) - 2021 నోటిఫికేషన్ విడుదల అయింది. జూలై 1 నుంచి 15 వ తేదీ వరకు దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందని దోస్త్ కన్వీనర్ లింబాద్రి వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ ఆన్‌లైన్ విధానంలోనే ఉంటుందని చెప్పారు. దరఖాస్తు ఫీజు రూ. 200గా నిర్ణయించినట్లు తెలిపారు. జూలై 3 నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జూలై 22న ఉంటుందని వెల్లడించారు. మొదట విడతలో సీటు సాధించిన విద్యార్థులు జూలై 23 నుంచి 27వ తేదీ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని ప్రకటనలో తెలిపారు.
దోస్త్ ద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీకామ్ ఒకేషనల్, బీకామ్ ఆనర్స్, బీఎస్ డబ్ల్యూ, బీబీఎం, బీసీఏ లాంటి కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. విద్యార్థులు దోస్త్ వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/ లేదా మీసేవ సెంటర్ లేదా టీ యాప్ ఫోలియా మొబైల్ యాప్ (T App Folio Mobile App) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆలస్య రుసుముతో..
రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు జూలై 23 నుంచి 27వ తేదీ వరకు ఉంటాయి. దీనికి రూ.400 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జూలై 24 నుంచి 29వ తేదీ వరకు ఉంటుంది. రెండో విడత సీట్ల కేటాయింపు ఆగస్టు 4వ తేదీన ఉంటుంది. రెండో విడతలో సీటు సాధించిన విద్యార్థులు ఆగస్టు 5 నుంచి 10వ తేదీలోపు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
మూడో విడత రిజిస్ట్రేషన్లకు కూడా రూ.400 ఆలస్య రుసుము చెల్లించాలి. ఇందులో రిజిస్ట్రేషన్లు ఆగస్టు 5 నుంచి 10 వరకూ ఉంటాయి. ఆగస్టు 6 నుంచి 11వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్లను ఇచ్చుకోవచ్చు. ఆగస్టు 18వ తేదీన మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటుంది. మూడో విడతలో ఆగస్టు 18 నుంచి 19 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం అవుతాయని ప్రకటనలో పేర్కొన్నారు.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుల ప్రారంభం (మొదటి విడత) : జూలై 1 నుండి 15 వరకు
వెబ్ ఆప్షన్లు : జూలై 3 నుంచి 16 వరకు
సీట్ల కేటాయింపు : జూలై 22
దరఖాస్తుల ప్రారంభం (రెండో విడత) : జూలై 23 నుంచి 27 వరకు
వెబ్ ఆప్షన్లు : జూలై 24 నుంచి 29 వరకు
సీట్ల కేటాయింపు : ఆగస్టు 4
దరఖాస్తుల ప్రారంభం (మూడో విడత) : ఆగస్టు 5 నుంచి 10 వరకు
వెబ్ ఆప్షన్లు : ఆగస్టు 6 నుంచి 11 వరకు
సీట్ల కేటాయింపు : ఆగస్టు 18
విడుదలైన సెకండియర్ ఫలితాలు..
కోవిడ్ కారణంగా తెలంగాణలో ఇంటర్మీడియట్, టెన్త్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలనే సెకండియర్‌కు కేటాయించింది. దీనిలో మొత్తం 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1,76,719 మంది ‘ఏ’ గ్రేడ్... 1,04,888 మంది ‘బీ’ గ్రేడ్, 61,887 మంది ‘సీ’ గ్రేడ్ మరియు 1,08,093 మంది ‘డీ’ గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలైన మరుసటి రోజే దోస్త్ నోటిఫికేషన్ వెలువడింది.