Saina Nehwal: రాకెట్ పట్టకముందే... కరాటేలో పతకం సాధించింది

Continues below advertisement

సైనా నెహ్వాల్ అంటే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ, నిజం ఏమిటంటే... ఆమె బ్యాడ్మింటన్ రాకెట్ పట్టకముందే కరాటేలో పతకం సాధించింది. సైనా గురించి ఇలాంటి మరికొన్ని కొత్త విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కరాటేలో బ్రౌన్ బెల్టు
సైనా నెహ్వాల్ భారత బ్యాడ్మింటన్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న క్రీడాకారిణి. ప్రస్తుతం ఎంతో మంది చిన్నారులు రాకెట్ పట్టారంటే అందుకు కారణం సైనా నెహ్వాలే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి సైనా బ్యాడ్మింటన్ రాకెట్ పట్టకముందే కరాటేలో రాణించింది. కరాటేలో ఆమె బ్రౌన్ బెల్టు కూడా సాధించింది. ఏస్ కరాటే ఛాంపియన్ కూడా. 

మొత్తం టైటిళ్లు 24... ఒలింపిక్స్‌లో కాంస్యం
 తొమ్మిదేళ్ల వయస్సులో రాకెట్ పట్టిన సైనా తన కెరీర్ పరంగా ఏమాత్రం వెనుదిరిగి చూసుకోలేదు. అంచెలంచెలుగా విజయాలు సాధిస్తూ ప్రపంచంలోనే నంబర్-1 క్రీడాకారిణిగా ఎదిగింది. ఇప్పటి వరకు మొత్తం 24 సూపర్ సిరీస్ టైటిళ్లను గెలుచుకుంది. భారత్ తరఫున మొత్తం 3 సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న సైనా  ఒక్క కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. కరోనా కారణంగా టోర్నీలు రద్దవ్వడంతో ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌కి సైనా అర్హత కోల్పోయింది.

కశ్యప్‌తో ప్రేమ వివాహం
తన సహచర ఆటగాడైనా పారుపల్లి కశ్యప్‌ని సైనా 2018 డిసెంబరులో వివాహం చేసుకుంది. వీరిద్దరిది ప్రేమ వివాహం. పుల్లెల గోపీచంద్ అకాడమీలో వీరికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ప్రాక్టీస్ చేసేవాళ్లు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇరువురు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి పెద్దల సమక్షంలో వీరి వివాహం ఎంతో నిరాడంబరంగా జరిగింది. 

ఐస్ క్రీం అంటే చాలా ఇష్టం
సైనా నెహ్వాల్ కి ఐస్ క్రీం అంటే చాలా ఇష్టం. ఫిట్ నెస్ కోసం తరచుగా ఐస్ క్రీం తినకపోయినా... టోర్నీలో విజేతగా నిలిస్తే మాత్రం వెంటనే స్నేహితులతో బయటకు వెళ్లిపోయి ఐస్ క్రీం లాగించేస్తూ గెలుపు సంబరాలు చేసుకుంటుంది. 

 తెలుగులో మహేష్... హిందీలో షారుక్
సైనా నెహ్వాల్‌కి సినిమాలంటే చాలా ఇష్టం. టాలీవుడ్‌లో ప్రిన్స్ మహేష్ బాబు, బాలీవుడ్‌లో షారుక్ ఖాన్‌లు సైనా అభిమాన హీరోలు. వీరి సినిమాలు మిస్ అవ్వకుండా చూస్తానని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

12వ తరగతి వరకే చదువుకున్న సైనా బ్యాడ్మింటన్‌లో అద్భుతమైన విజయాలతో ఆర్థికంగా కూడా బాగానే స్థిరపడింది. తన ఆస్తుల విలువ సుమారు రూ.36కోట్లు. వాణిజ్య ప్రకటనలు, పలు ఒప్పందాల ద్వారా ఇప్పటికీ నెలకు సుమారు రూ.40లక్షలు అందుకుంటోంది. సైనా దగ్గర మూడు విలాసవంతమైన కార్లు ఉన్నాయి. రూ.34లక్షల మినీ కూపర్, రూ.40లక్షల మెర్సిడేజ్ బెంజ్, రూ.38 లక్షల బీఎమ్‌డబ్ల్యూ సైనా సొంతం. ప్రస్తుతం సైనా తన స్వస్థలమైన బిహార్‌లో బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభించాలన్న ఆలోచనలో ఉంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram