Army Jobs: 8, 10, ఇంటర్ అర్హతతో ఆర్మీ ఉద్యోగాలు.. రూ.35 వేలకు పైగా జీతం
ఆర్మీలో ప్రారంభ స్థాయి (ఎంట్రీ లెవెల్) ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త. ఎనిమిది, పది తరగతులు, ఇంటర్ విద్య అర్హతతో ఆర్మీలో రూ.35 వేలకు పైగా జీతాన్ని ఇచ్చే ఉద్యోగాలు త్వరలో భర్తీ కానున్నాయి. దీనికి సంబంధించిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఆగస్టు 16 నుంచి 31 వరకు జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా జరగనున్న ఈ ర్యాలీ ద్వారా సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ టెక్నికల్ (ఏవియేషన్), సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ క్లర్క్ / స్టోర్ కీపర్ టెక్నికల్, సోల్జర్ ట్రేడ్స్‌మన్ పోస్టులను భర్తీ చేయనుంది. ఫిజికల్, మెడికల్, రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
ఏయే జిల్లాల వారికి?
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, యానాం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జూన్ 20 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు http://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. అభ్యర్థులు ర్యాలీలో పాల్గొనాల్సిన తేదీ, అవసరమైన పత్రాల వివరాలు ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. నియమకాల్లో భాగంగా తొలుత పత్రాలు పరిశీలిస్తారు. తర్వాత దేహదారుడ్య, శారీరక కొలతల పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు ఉంటాయి. క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి కొన్ని సడలింపులు ఉంటాయి.
రూ.35 వేలకు పైగా వేతనం..
ఆర్మీలో సాధారణంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలను ప్రాంతాలవారీగా భర్తీ చేస్తారు. దీని కోసం రాష్ట్రం లేదా కొన్ని జిల్లాలను ఒక యూనిట్‌గా తీసుకుని స్థానికులకు రిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహిస్తారు. అభ్యర్థులను ఫిజికల్, మెడికల్, రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. అనంతరం స్టైపెండ్‌తో కూడిన శిక్షణ కొంత కాలం ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత విధుల్లోకి తీసుకుంటారు. ఈ పోస్టుల్లో చేరినవారికి అన్ని అలవెన్సులు కలిపి మొదటి నెల నుంచే రూ.35 వేలకు పైగా వేతనం లభిస్తుంది.
పోస్టుల వివరాలు
1. సోల్జర్ జనరల్ డ్యూటీ
వయసు 17 1/2 నుంచి 21 సంవత్సరాల లోపు ఉండాలి. 166 సెం.మీ. ఎత్తు, దానికి తగిన బరువు ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు ఛాతీ విస్తీర్ణం 77 సెం.మీ. ఉండాలి. పదో తరగతిలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 2001 అక్టోబర్ 1 నుంచి 2004 ఏప్రిల్ 1 మధ్య జన్మించి ఉండాలి.
2. సోల్జర్ టెక్నికల్
వయసు 17 1/2 నుంచి 23 సంవత్సరాల లోపు ఉండాలి. 1998 అక్టోబర్ 1 నుంచి 2004 ఏప్రిల్ 1 మధ్య జన్మించి ఉండాలి. ఎత్తు 165 సెం.మీ., దానికి తగిన బరువు, ఛాతీ విస్తీర్ణం 77 సెం.మీ. ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
3. సోల్జర్ టెక్నికల్ (ఏవియేషన్)
వయసు 17 1/2 నుంచి 23 సంవత్సరాల లోపు ఉండాలి. 165 సెం.మీ. ఎత్తు, దానికి తగిన బరువు, ఛాతీ విస్తీర్ణం 77 సెం.మీ. ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రతి సబ్జెక్టులో 40 శాతం, మొత్తం మీద 50 శాతం మార్కులు సాధించాలి.
4. సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్
వయసు 17 1/2 నుంచి 23 సంవత్సరాల లోపు ఉండాలి. 165 సెం.మీ ఎత్తు, దానికి తగిన బరువుతో పాటు ఛాతీ విస్తీర్ణం 77 సెం.మీ ఉండాలి. ఈ పోస్టులు ఆర్మీ మెడికల్ కాప్స్ (ఏఎంసీ)లో ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రతి సబ్జెక్జులోనూ కనీసం 40 శాతం మార్కులు సాధించాలి.
5. సోల్జర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్
వయసు 17 1/2 నుంచి 23 సంవత్సరాల లోపు ఉండాలి. ఎత్తు 162 సెం.మీ. ఛాతీ విస్తీర్ణం 77 సెం.మీ. ఉండాలి. ఇంటర్ ఏదోక గ్రూపుతో 60 శాతం మార్కులు పొంది ఉండాలి. ప్రతి సబ్జెక్టులోనూ 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ఇంటర్ లేదా టెన్త్ మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులలో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి.
6. సోల్జర్ ట్రేడ్స్‌మన్
ఈ విభాగంలో హౌస్ కీపర్, మెస్ కీపర్, గుర్రాల పర్యవేక్షణ పోస్టులకు ఎనిమిదో తరగతి విద్యార్హతతోనే దరఖాస్తు చేసుకోవచ్చు. చెఫ్, వాషర్ మెన్, డ్రెస్సర్, స్టివార్డ్, టైలర్, ఆర్టిజన్ (వడ్రంగి / ఇస్త్రీ / తాపీ పని) మొదలైన ఉద్యోగాలను పదో తరగతి విద్యార్హతతో భర్తీ చేస్తారు. అన్ని పోస్టులకు వయసు 17 1/2 నుంచి 23 సంవత్సరాల లోపు ఉండాలి. ఎత్తు 166 సెం.మీ., దానికి తగిన బరువుతో పాటు ఛాతీ విస్తీర్ణం 76 సెం.మీ. ఉండాలి.
ముఖ్యమైన వివరాలు..
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 3
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
హాల్ టికెట్లు: ఆగస్టు 9 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ర్యాలీ నిర్వహణ: ఆగస్టు 16 నుంచి 31 వరకు
వేదిక: ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, వైజాగ్, ఆంధ్రప్రదేశ్.
వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in/