Ind vs SA 3rd ODI Highlights | సెంచరీతో సత్తా చాటిన జైశ్వాల్..సిరీస్ కొట్టేసిన భారత్ | ABP Desam
హమ్మయ్య మొత్తానికి సిరీస్ గెలిచేశాం. టెస్ట్ సిరీస్ ఓటమితో ఘోర పరాభవం మూటకట్టుకున్న భారత్...విశాఖ పట్నంలో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వన్డే సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసి సౌతాఫ్రికా విసిరిన 271 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో పూర్తి స్థాయిలో తొలి వన్డే సిరీస్ ఆడుతున్న యువ కెరటం యశస్వి జైశ్వాల్ సెంచరీతో దుమ్మురేపాడు. 121 బంతుల్లో 12ఫోర్లు 2 సిక్సర్లతో 116పరుగులు చేసి నాటౌట్ గా నిలవటంతో పాటు కెరీర్ లో ఆడిన నాలుగో వన్డేకే తొలిసెంచరీ బాదేసి ఫ్యూచర్ తనదేనని సిగ్నల్ ఇచ్చాడు. జైశ్వాల్ కి తోడుగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 73 బంతుల్లో 7ఫోర్లు 3 సిక్సర్లతో 75పరుగులు చేసి వింటేజ్ రోహిత్ ను చూపిస్తే...వరుసగా రెండు సెంచరీలతో ఊపు మీదున్న కింగ్ విరాట్ కొహ్లీ ఫామ్ ను కంటిన్యూ చేస్తూ మూడో వన్డేలో 45 బంతుల్లోనే 6ఫోర్లు 3 సిక్సర్లతో 65పరుగులు చేసి నాటౌట్ గా నిలవటంతో పాటు భారత్ ను 9 వికెట్ల తేడాతో గెలిపించాడు. అంతకు ముందు రెండేళ్ల తర్వాత తొలిసారి టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ఓపెనర్, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ శతకంతో రెచ్చిపోయాడు...డికాక్..89 బాల్స్ లోనే 8 ఫోర్లు 6 సిక్సర్లతో 106పరుగులు చేయగా...బవుమా 48పరుగులు మినహా మరే బ్యాటర్ పెద్దగా సపోర్ట్ చేయలేదు. ఫలితంగా సఫారీ జట్టు 270 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు తీసి డికాక్ మినహా మిగిలిన సౌతాఫ్రికా జట్టును బాగానే కట్టడి చేయటంతో భారత్ సిరీస్ విజయానికి బాటలు పడ్డాయి.