(Source: ECI/ABP News/ABP Majha)
Sarpanch Mud Bath: బ్రిడ్జి కోసం సర్పంచ్ వినూత్న నిరసన..బురదలో స్నానం
ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఓ సర్పంచ్ వినూత్న నిరసన చేపట్టాడు. బురద నీటిలో కూర్చొని నిరసనలు తెలుపుతూ అదే నీటితో స్నానం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి రూరల్ మండలం, పుదిపట్ల పంచాయతీ సర్పంచ్ బడి సుధా యాదవ్ వినూత్న నిరసన చేపట్టారు. బురద నీటితో స్నానం చేస్తూ ఆర్ అండ్ బి అధికారులు, బ్రిడ్జి కాంట్రక్టర్ లపై మండిపడ్డారు. 2018లో ప్రారంభించిన బ్రిడ్జి పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తి చేయకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
చంద్రగిరి, మదనపల్లి నుంచి తిరుపతికి వచ్చే వారంతా జూపార్కు రోడ్డులో ప్రయాణిస్తున్నారని సర్పంచ్ అన్నారు. అక్కడ కూడా నాలుగు లైన్లు రోడ్డు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తిరుపతికి వెళ్ళేందుకు సరైన మార్గం లేక ప్రజలు నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే మోకాళ్ళ లోతు గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. 20 రోజుల క్రితం జూపార్కు రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువ డాక్టర్లు మృతి చెందారని గుర్తు చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలందరి సహకారంతో హైకోర్టు కేసు వేస్తామని అలాగే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని స్పష్టం చేశారు.