Tirupati Deputy Mayor TDP Won | తీవ్ర ఉత్కంఠ మధ్య తిరుపతిలో టీడీపీ హవా | ABP Desam
తీవ్ర ఉత్కంఠ మధ్య తిరుపతి లో డిప్యూటీ మేయర్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ కి ఇన్నాళ్లూ ఏకైక కార్పొరేటర్ గా ఉన్న ఆర్సీ మునికృష్ణ ఈరోజు ఎన్నికలో డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. సంఖ్యాపరంగా తిరుపతి నగర కార్పొరేషన్ లో వైసీపీకి కావాల్సినంత బలం ఉన్నా...ప్రభుత్వం మారాక పరిస్థితులు మారిపోయాయి. 50 డివిజన్లున్న తిరుపతి కార్పొరేషన్ లో గతంలో 49 డివిజన్లకు ఎన్నికలు జరగగా...48వైసీపీ, ఒకే ఒక్కటి టీడీపీ గెలుచుకున్నాయి. టీడీపీ నుంచి కార్పొరేటర్ గా అప్పుడు ఆర్సీ మునికృష్ణ ఎన్నికయ్యారు. అదంతా గతం. ప్రభుత్వం మారిన తర్వాత 22 మంది కార్పొరేటర్లు టీడీపీ వైపు వచ్చేశారు. ఎక్స్ అఫిషీయో మెంబర్లు టీడీపీ కి మద్దతుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉంటే వైసీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి కి మద్దతుగా ఎంపీ గురుమూర్తి ఉన్నారు. దీంతో నలుగురు వైసీపీ కార్పొరేటర్లను ఎన్నికకు రాకుండా టీడీపీ నేతలు కావాలనే అడ్డుకున్నారనే..మరో ఎక్స్ అఫీషియో మెంబర్ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపించింది. సరిపడనంత కోరం ఉండటంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగగా..వైసీపీ అభ్యర్థికి అనకూలంగా 21 ఓట్లు పడగా...టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా 26 ఓట్లు పడటంతో...ఇన్నాళ్లూ ఏకైక టీడీపీ కార్పొరేటర్ గా ఉన్న ఆర్సీ మునికృష్ణ ఇప్పుడు తిరుపతి డిప్యూటీ మేయర్ గా విజయం సాధించినట్లైంది.





















