Kovuru MLA: సినీ హీరోలపై ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసంశలు
రాష్ట్రవ్యాప్తంగా వరద బాధితులకు ప్రభుత్వం 2వేల రూపాయలు ఇస్తుంటే.. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాత్రం కుటుంబానికి 10వేల రూపాయలు సాయం చేస్తున్నారు. సరిగ్గా సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటనకు ఒకరోజు ముందే ఈ పరిహారం అందజేయడం విశేషం. నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహా ఇతర దాతల నుంచి విరాళాలు సేకరించి నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ పరిధిలోని 42 కుటుంబాలకు నష్టపరిహారం అందించారు. వరద బాధితులకు సినీ నటులు సాయం చేయాలని గతంలో డిమాండ్ చేసిన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, చిరంజీవి, రామ్ చరణ్ , ఎన్టీఆర్, మహేష్ బాబుకి అభినందనలు తెలిపారు. వరద బాధితులకు సినీ హీరోలు తలా 25 లక్షల రూపాయలు ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.





















