Srisailam Dam: కృష్ణమ్మ ఉరుకులు పరుగులు... శ్రీశైలం డ్యామ్ రెండు గేట్లు ఎత్తివేత
శ్రీశైలం డ్యామ్ కు భారీగా వరద వస్తోంది. శ్రీశైలం జలాశయం రెండు గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి స్పిల్వే ద్వారా 55,140 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 2,28,585 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండటంతో అధికారులు గేట్లను పైకెత్తారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయానికి జలాశయ నీటి మట్టం 883.90 అడుగులు, నీటి నిల్వ 209.1579 టీఎంసీలుగా నమోదైంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ అదనంగా 59,528 క్యూసెక్కుల నీటిని సాగర్ కు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలైన ఆల్మట్టి, తుంగభద్ర, నారాయణ్ పూర్ జలాశయాల్లో నీటి నిల్వలు గరిష్ఠ స్థాయిలో ఉండటంతో దిగువ ప్రాంతాలైన జూరాల, శ్రీశైలానికి వరద ప్రవాహం పెరిగింది. ఈ సీజన్లో శ్రీశైలం జలాశయం గేట్లను పైకెత్తి నీటిని విడుదల చేయడం ఇది రెండోసారి.





















