Tadipatri Politics : జేసీ Vs కేతిరెడ్డి.. దశాబ్దాల తా'ఢీ'పత్రి.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్. ఇప్పుడే కాదు. ఏపీలో ప్రభుత్వం మారినప్పటి నుంచి ఎప్పుడూ ఏదో విషయంలో హైలెట్ అవుతూనే ఉంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత మరీ ఎక్కువ. 2019 ఎన్నికలకు ముందు వరకు తాడిపత్రి అంటే జేసీ బ్రదర్స్ అడ్డా. అన్న జేసీ దివాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే తమ్ముడు ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా ఉండేవారు. 2014ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా గెలిస్తే.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. అలా దశాబ్దాలుగా పట్టు నిలుపుకుంటూ వచ్చిన నియోజకవర్గంలో వారికి తొలిసారిగా 2019 ఎన్నికల్లో షాక్ తగిలింది. గత ఎన్నికల్లో వారసులకు అవకాశం ఇచ్చి తాము సైడయ్యారు. కానీ ఆ వారసులకు తొలిసారే ఎదురుదెబ్బ తగిలిగింది. అప్పట్నుంచి మళ్లీ జేసీ ప్రభాకర్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. లేకపోతే తన వర్గం అంతా చెల్లాచెదురు అయిపోతుందని జేసీ బ్రదర్స్ భావించడమే దీనికి కారణం. ఎందుకంటే.. అవతలి వైపు ఎమ్మెల్యేగా గెలిచింది కేతిరెడ్డి పెద్దారెడ్డి. కేతిరెడ్డి వర్సెస్ జేసీ పోరాటం దశాబ్దాల నాటిది మరి.