Ganesh Chaturthi 2021: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. ఇవాళ ఉదయం ఆలయంలో అర్చకులు, వేదపండితులు ధ్వజారోహణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ధ్వజస్తంభంపై ఉన్న మూషిక పటానికి ప్రత్యేక పూజలు చేసి మూషిక పటాన్ని ధ్వజస్తంభంపైకి ఎగురవేసి కాణిపాకం బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాది దేవతలను ఆహ్వానించారు.. అనంతరం స్వామి వారి పటానికి ప్రత్యేక అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి ధూప ,దీప నైవేద్యాలు సమర్పించారు. 21 రోజుల పాటు జరిగే స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నుంచి స్వామి వారికి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు..అనంతరం 12 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు..
కరోనా నేపథ్యంలో గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే గ్రామోత్సవాలు రద్దు చేసి కేవలం ప్రాకారోత్సవం మాత్రమే నిర్వహిస్తున్నారు..ప్రతి రోజు ఆలయ ఉభయదారులచే స్వామి వారు ప్రతి రోజు ఒక్కో వాహనంపై ఉరేగుతారు..ఈ కార్యక్రమాలలో తక్కువ సంఖ్యలో ఉభయదారులను అనుమతిస్తామని ఆలయ ఈఓ వెంకటేష్ తెలిపారు.అయితే ఇవాళ సాయంత్రం నిర్వహించే హంస వాహనంపై స్వామి వారు విహరించనున్నారు..