(Source: ECI/ABP News/ABP Majha)
AP Gulab Cyclone Effect: గులాబ్ తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష... మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటన
తుపాను పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తుపాను అనంతర పరిస్థితులను సీఎంకు వివరించారు. వర్షం తగ్గగానే విద్యుత్ పునరుద్ధరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తుపాను పరిస్థితులపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ విశాఖలో ఉండి ఆరా తీస్తున్నారు. ఈరోజు కూడా అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని సీఎస్‌కు సీఎం సూచించారు. తుపాను వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
బాధితులకు రూ.వెయ్యి సాయం
బాధితులకు సహాయం చేయడంలో వెనకడుగు వేయవద్దని అధికారులకు సీఎం జగన్ సూచించారు. సహాయక శిబిరాల్లో అందించే ఆహారం నాణ్యంగా ఉండాలన్నారు. మెరుగైన వైద్యం, రక్షిత తాగునీరు అందించాలని సూచించారు. అవసరమైన చోట్లా సహాయక శిబిరాలు ఏర్పాటుచేయాలని, విశాఖలోని ముంపు ప్రాంతాల్లో వర్షపు నీరు తొలగించాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్... ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు రూ.వెయ్యి తక్షణసాయం అందించాలన్నారు. అలాగే శిబిరాల నుంచి బాధితులు తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు రూ.వెయ్యి చొప్పున అందజేయాలన్నారు. వరద ప్రాంతాల్లో త్వరగా పంట నష్టం అంచనాలు రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.