Alluri District: చెట్టు నుంచి ఉబికి వచ్చిన నీళ్లు - ఆశ్చర్యపోయిన అటవీ అధికారులు, ఎక్కడంటే?
Andhrapradesh News: చెట్ల నుంచి పాలు కారడం చూశాం. అయితే, విచిత్రంగా చెట్టు నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి. దీన్ని చూసిన అధికారులు ఒక్కసారిగా అవాక్కయారు. ఇంతకూ ఆ జలధార వృక్షం ఎక్కడుందో తెలుసా.!
Water Came From The Tree in Alluri District: సాధారణంగా భూగర్భ జలాలు ఎక్కువ ఉంటే బోర్ల నుంచి నీరు ఉబికి రావడం మనం చూసుంటాం. కొన్ని ప్రాంతాల్లో చెట్ల నుంచి పాలు వచ్చిన ఘటనలూ విన్నాం. అయితే, అక్కడ చెట్ల నుంచి నీరు ఉబికి వస్తోంది. దీన్ని చూసిన అటవీ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఓ చెట్టు మొదలు భాగం నరుకుతుండగా ఒక్కసారిగా నీళ్లు ఉబికి వచ్చాయి. అల్లూరి జిల్లాలో కనిపించిన ఈ అరుదైన దృశ్యం నెట్టింట వైరల్ అవుతోంది. అల్లూరి జిల్లా రంపచోడవరం పాపికొండల నేషనల్ ఫారెస్ట్ పరిధిలోని కింటుకూరు ప్రాంతంలో ఎక్కువగా నల్ల మద్ది చెట్లు ఉన్నాయి. ఆ వృక్షాల నుంచి నీళ్లు చుక్కలుగా రావడాన్ని గుర్తించిన అధికారులు.. వెంటనే బెరడును నరికారు. దీంతో వెంటనే మొదలు భాగం నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి. దీన్ని చూసిన వారు ఆశ్చర్యపోయి.. ఆ నీటిని తాగారు. దీన్ని జలధార వృక్షంగా పేర్కొంటున్నారు. ఆ చెట్టు నుంచి దాదాపు 20 లీటర్ల నీరు వస్తుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అయితే, కింటుకూరు అటవీ ప్రాంతంలో వేలాదిగా నల్లమద్ది చెట్లు ఉన్నాయి. కాగా, కొన్నింటికే నీటిని నిల్వ చేసుకునే వ్యవస్థ ఉంటుందని.. దాదాపు 20 లీటర్ల స్వచ్ఛమైన నీరు నిల్వ చేసుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. వందల్లో ఒక చెట్టుకు మాత్రమే ఇలా నీటిని నిల్వ చేసుకునే వ్యవస్థ ఉంటుందని చెబుతున్నారు.