Eluru News: 'మా భార్యలను కాపురానికి పంపండి' - కలెక్టరేట్ వద్ద ఇద్దరు అల్లుళ్ల నిరాహార దీక్ష, ఏలూరు జిల్లాలో ఘటన
Andhrapradesh News: తమ భార్యలను కాపురానికి పంపడం లేదంటూ ఇద్దరు అల్లుళ్లు ఏకంగా కలెక్టరేట్ వద్దే టెంట్, ఫ్లెక్సీలతో నిరాహార దీక్షకు దిగారు. తమ మామ అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడంటూ మండిపడ్డారు.
Sons In Law Protest Against Their Father In Law In Eluru: తమ భార్యలను కాపురానికి పంపాలంటూ అత్తింటికి వెళ్లి గొడవ పడే వారిని మనం చూసుంటాం. అలాగే, భార్యభర్తల మధ్య ఏమైనా గొడవలు వచ్చినప్పుడు స్థానికంగా ఉన్న పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టి వారి సమస్యలు పరిష్కరించడమూ చూశాం. అయితే, ఇక్కడ విచిత్రంగా ఇద్దరు అల్లుళ్లు తమ నిరసన తెలిపారు. తమ భార్యలను కాపురానికి పంపాలంటూ ఏకంగా కలెక్టరేట్ వద్దే నిరాహార దీక్షకు దిగారు. అంతే కాకుండా ఓ టెంట్ వేసి మరీ తమ మామకు వ్యతిరేకంగా పోస్టర్ సైతం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఏలూరు కలెక్టరేట్ (Eluru Collectorate) వద్ద అల్లుళ్ల రిలే నిరాహార దీక్ష ఆసక్తికరంగా మారింది.
ఏం జరిగిందంటే.?
తమ మామ తన ఇద్దరు కూతుళ్లను కాపురానికి పంపడం లేదంటూ అల్లుళ్లు పవన్, శేషసాయి ఏలూరు కలెక్టరేట్ వద్ద శనివారం రిలే నిరాహార దీక్షకు దిగారు. ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. తమ మామ శ్రీనివాస రామానుజ అయ్యంగార్.. ఇద్దరు కూతుళ్లను తమతో కాపురానికి పంపకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని ఇద్దరు అల్లుళ్లు మండిపడ్డారు. తిరిగి తమపైనే అక్రమ కేసులు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ డిమాండ్లతో కూడిన ఫ్లెక్సీలను దీక్షా శిబిరం వద్ద ఉంచారు. 'మా భార్యలను కాపురానికి పంపించాలి, కన్న కూతురిని తండ్రికి చూపించాలి, కూతుళ్లను కాపురానికి పంపించకుండా అల్లుళ్లపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలి. శాడిస్ట్ మామపై చర్యలు తీసుకోవాలి.' అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు.
వేరే దారి లేకే..
తమ సమస్యను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని ఓ అల్లుడు పవన్ తెలిపారు. ఆయన సూచనతో ఎస్పీని కలిశామని ఆయన డీఎస్పీకి చెప్పినట్లు పేర్కొన్నారు. 'నా భార్యను మామయ్య కాపురానికి పంపించడం లేదు. నా కూతురుని చూపించడం లేదు. ఫోన్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. చిన్న పాపకు నా గురించి నెగిటివ్‌గా చెబుతున్నారు. బర్త్ డే విషెష్ చెప్పినా.. నెగిటివ్ ఆడియో మెసేజ్‌లు పెట్టి పంపిస్తున్నారు. మాకు వేరే దారి లేకే దీక్షకు కూర్చున్నాం.' అంటూ పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Viral Video: అమెరికాలో సత్యనారాయణ స్వామి వ్రతం - ఇంగ్లీష్‌లో సత్యదేవుని వ్రత కథ, వైరల్ వీడియో