Dating App: డేటింగ్ యాప్‌లతో రెస్టారెంట్ల ఘరానా మోసం, తడిచి మోపడయ్యేంత బిల్లు!
Viral News | డేటింగ్ యాప్‌లను అడ్డం పెట్టుకుని పలు రెస్టారెంట్లు మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మహిళలను ఎరగా వేసి పలు రెస్టారెంట్లు ఆదాయం పెంచుకునే పనిలో పడ్డాయి.
Restuarants Scams with Dating App ఆదాయం సంపాదించుకునేందుకు రెస్టారెంట్లు కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నాయి. డేటింగ్ యాప్‌లను ఉపయోగించి తమ రెస్టారెంట్లకు డిమాండ్ పెంచుకుంటున్నాయి. కొంతమంది రెస్టారెంట్ నిర్వాహకులు యువతుల అందాన్ని పెట్టుబడిగా పెట్టి రాబడి పొందడానికి పాపులర్ డేటింగ్ యాప్‌లు టిండర్ (Tinder), బంబుల్ (Bumble), హింగే(Hinge), ఓకే క్యూపిడ్ (OKCupid)లను ఉపయోగిస్తున్నారు.
డేటింగ్ పేరుతో పిలిపించి..
యువతులు డేటింగ్ యాప్‌లలో యువకులు, బిజినెస్ మ్యాన్‌లతో పరిచయాలు పెంచుకుంటారు. యాప్ ద్వారా వారితో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుంటారు. ఎప్పుడైతే మగవారు కలవాలని అడుగుతారో ఇదే అదనుగా వారిని డేటింగ్ కోసం రెస్టారెంట్‌కు తీసుకెళతారు. యువతులుల ముందుగానే ఒప్పందం చేసుకున్న రెస్టారెంట్‌కు వారిని డిన్నర్ డేట్‌కు పిలుస్తారు. ఇదంతా ఊహించని సదరు వ్యక్తులు ఉత్సాహంగా రెడీ అయి వారి వెంట వెళతారు. రెస్టారెంట్‌కు తీసుకెళ్లి వారితో ఖరీదైన మద్యం, విందు, ఇతర ఐటమ్స్ ఆర్డర్ చేస్తారు. కాసేపయ్యాక ఫోన్ వస్తున్నట్టు, వాష్‌రూమ్ పేరుతో అక్కడ్నుంచి మెల్లిగా జారుకుంటారు. ఎంతసేపు చూసినా తిరిగిరారు. ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ చేసి ఉంటుంది. ఏమైందా అని ఆలోచించేలోపు బిల్లు కట్టమని రెస్టారెంట్ సిబ్బంది వస్తారు. ఆర్డర్ క్యాన్సిల్ చేయమన్నా ఒప్పుకోరు. బిల్లు చూస్తే తడిసి మోపెడై ఉంటుంది. బిల్లు కట్టకపోతే బౌన్సర్లను పురమాయించి వారిపై దాడి చేయిస్తారు. వారిని రెస్టారెంట్‌కు తీసుకొచ్చినందుకు గాను వారికి బిల్లులో కొంచెం వాటా ఇస్తారు నిర్వాహకులు.
కొన్ని సందర్భాల్లో డేటింగ్ కోసం వచ్చిన యువతులు ఖరీదైన మద్యం, ఫుడ్ ఆర్డర్ చేసి వారు కూడా మందుతాగి దర్జాగా వెళ్లిపోతుంటారు. డేటింగ్ కోసం వచ్చిన ఆ యువతులు రెస్టారెంట్లోనే ఖరీదైన మద్యం, ఫుడ్ తప్ప తక్కువ ధరలో ఉన్నవాటి వంక కనీసం కన్నెత్తి కూడా చూడరు. ఇక తప్పదనుకుని వచ్చినవారు పే చేసి వెళ్లిపోతుంటారు. ఒక్క గంటా రెండు గంటల్లోనే వారిచేత రూ. 60 వేల నుంచి రూ. లక్ష వరకు బిల్లు కట్టించిపోతుంటారు.
దేశమంతా విస్తరించిన సంస్కృతి
డేటింగ్ యాప్‌లతో రెస్టారెంట్లకు పాల్పడుతున్న ఘటనలు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ జరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఈ తరహా ఘటనలు నిత్యం జరుగుతున్నాయని బాధితులు చెప్పుకుంటూ బాధపడుతున్నారు. తామంతా డేటింగ్ యాప్‌ల ద్వారానే ఈ తరహా మోసాలకు గురైనట్టు చెబుతున్నారు. దీంతో ప్రతి నగరంలోనూ కొత్తగా పరిచమయమైన యువతులతో కొన్ని రెస్టారెంట్లకు వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్న పరిస్థితి నెలకొంది.
🚨 MUMBAI DATING SCAM EXPOSE 🚨
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) August 23, 2024
THE GODFATHER CLUB ANDHERI WEST
◾BRAZEN SCAMMING EVERYDAY
◾12 victims in touch
◾Trap laid through Tinder, Bumble
◾Bill amounts 23K- 61K
◾3 men trapped by same girl@MumbaiPolice @CPMumbaiPolice @mymalishka @CMOMaharashtra@zomato pic.twitter.com/qGOacFCE9f
ముంబైలో ఘటన..
తాజాగా ఇలాంటి ఘటనలే కొన్ని ముంబై నగరంలో వెలుగులోకి వచ్చాయి. దీపికా నారాయణ్ భరద్వాజ్ అనే మహిళ ఈ తరహా మోసాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. డేటింగ్ యాప్ సాయంతో ముంబై నగరంలోని గాడ్ ఫాదర్ క్లబ్ ఇలాంటి మోసాలకు పాల్పడుతోందని ఆమె పేర్కొన్నారు. ఈ మోసాలకు సంబంధించి బిల్లులు రూ. 23 వేల నుంచి రూ. 61 వేలు తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. సదరు రెస్టారెంట్ నిర్వాహకులు బిల్లులు కట్టడానికి నిరాకరించిన వారిపై బౌన్సర్లతో దాడులు చేయించిన ఘటనలు కూడా ఉన్నాయని పేర్కొనడం విశేషం.
ఆర్డర్ చేసిన ఐటమ్స్‌ను క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉండదని చెబుతున్నారు. ఒకసారి రెస్టారెంట్‌లో అడుగుపెట్టిన తర్వాత మోసపోకుండా వెళ్లడం అసాధ్యమే.. ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీలో సివిల్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ఒక వ్యక్తి ఇదే తరహా మోసానికి గురై రూ. 1.20 వేలతో జేబు ఖాళీ చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. ఇదే తరహా ఘటనలు ఇటీవలే హైదరాబాద్‌లోనే వెలుగుచూశాయి.