Wedding Invitation: పెళ్లి పత్రికపై ప్రధాని మోదీ ఫోటో - అభిమానాన్ని చాటుకున్న యువకుడు, ఎక్కడంటే?
Sangareddy News: ఓ యువకుడు బీజేపీపై తన అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నాడు. తన పెళ్లి పత్రికపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించి బీజేపీ తరఫున కొత్తగా ప్రచారం నిర్వహించాడు.
PM Modi Photo In Wedding Invitation: తమకు ఇష్టమైన నాయకులపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా అభిమానం చాటుకుంటారు. ప్రస్తుతం ఎన్నికల వేడి నేపథ్యంలో నేతలు, వారి అభిమానుల ప్రచారం సైతం కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా, తెలంగాణకు చెందిన ఓ యువకుడు తన పెళ్లి కార్డుపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ముద్రించి ఆయనకు ఓటు వేయాలంటూ అభ్యర్థించాడు. కొత్త ట్రెండ్ తో ప్రచారం నిర్వహించగా.. ఈ పెళ్లి పత్రిక ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
సంగారెడ్డి జిల్లా ఆరుట్లకు చెందిన ఓ యువకుడు ప్రధాని మోదీ, బీజేపీకి వీరాభిమాని. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ తరఫున వెరైటీగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే తన పెళ్లి పత్రికపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించాడు. అంతే కాకుండా.. 'నా పెళ్లికి మీరు ఇచ్చే బహుమతి.. నరేంద్ర మోదీకి మీరు వేసే ఓటు.' అని ప్రింట్ చేయించాడు. వీటిని తన బంధు మిత్రులు అందరికీ పంచగా.. ప్రచారంలో ఇదో కొత్త ట్రెండ్ అంటూ అంతా ఆశ్చర్యపోయారు. ఈ వెడ్డింగ్ కార్డు.. నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.