Fake Police Station: ఓర్ని, పోలీసులకే టోపీ పెట్టారే, పోలీస్ స్టేషన్ పక్కనే నకిలీ పోలీస్ స్టేషన్ - 8 నెలల తర్వాత గుట్టురట్టు
బీహార్ లో ముక్కున వేలేసుకునే ఘటన జరిగింది. ఓ ముఠా ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ నే ఏర్పాటు చేసింది. 8 నెలల తర్వాత బయటకు తెలిసి.. అంతా కటకటాల్లోకి వెళ్లారు..
సమాజంలో జరిగే నేరాలను అరికట్టేందుకు ఏర్పాటైన వ్యవస్థే పోలీస్ వ్యవస్థ. నేరస్తులను పట్టుకోవడమే కాదు.. నేరాలే జరగకుండా చర్యలు తీసుకుంటారు పోలీసులు. అయితే నిత్యం పోలీసులను బురిడీ కొట్టిస్తూ కొత్త రకం నేరాలు చేస్తూనే ఉంటారు క్రిమినల్స్. రకరకాల పద్దతుల్లో ఎదుటి వారిని మోసం చేస్తుంటారు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతూ చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతుంటారు. కొందరు మాత్రం తెలివిగా తప్పించుకుంటారు.
సాధారణంగా కొంత మంది పోలీసులం అని చెప్పి జనాలను దోచుకున్న సంఘటనలు చాలా చూశాం. తీరా వాళ్లు నకిలీ పోలీసులు అని తెలిస్తే షాక్ అవుతాం. పోలీసులం అని చెప్పడం వేరు, ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం వేరు. నకిలీ పోలీస్ స్టేషనా? అని ఆశ్చర్యపోతున్నారా? ఔను.. ఓ దొంగల ముఠా ఏకంగా నకిలీ ఠాణా ఏర్పాటు చేసి దందాలు చేయడం మొదలు పెట్టింది. ఈ ఘటన బీహార్ లో జరిగింది. బాంకా జిల్లాకు చెందిన భోలా యాదవ్ అనే వ్యక్తి ఈ ముఠాకు నాయకత్వం వహించాడు.
తన గెస్ట్ హౌస్ ను నకిలీ పోలీస్ స్టేషన్ గా మార్చాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా కొంత మందికి రోజూ రూ.500 ఇచ్చి యూనిఫామ్ లు అందించాడు. వారికి నాటు తుపాకులు కూడా ఇచ్చాడు. వీరందరికీ హెడ్ గా ఓ డీఎస్పీని ఏర్పాటు చేశాడు. మొత్తానికి నకిలీ పోలీసులతో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి.. ఎవరికీ అనుమానం రాకుండా రన్ చేశాడు భోలా యాదవ్.
అది నకిలీ పోలీస్ స్టేషన్ అని తెలియని జనాలు అక్కడికి వచ్చి ఫిర్యాదులు కూడా చేయడం మొదలు పెట్టారు. ఫిర్యాదుదారుల నుంచి కూడా డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారు. పోలీసు ఉద్యోగాలు సైతం ఇస్తామని అమాయకులను మోసం చేసి భారీగా డబ్బులు లాగుతున్నారు. సుమారు 8 నెలల పాటు వీరి దందా కొనసాగింది. ఈ పోలీస్టేషన్ సైతం ఎంతో దూరంలో లేదు.. అసలు పోలీస్ స్టేషన్ కు అత్యంత దగ్గరగానే ఉంది. ఓ రోజు అసలు పోలీస్ స్టేషన్ లో పని చేసే శంభు యాదవ్.. నాటు తుపాకులతో ఉన్న పోలీసులను చూశాడు. వాళ్ల తీరు మీద అతడికి అనుమానం వచ్చింది. అసలు విషయాన్ని ఆరా తీశాడు. మొత్తంగా ఈ ఫేక్ పోలీస్ స్టేషన్ వ్యవహారం బయటపడింది. వెంటనే శంభు యాదవ్.. ఈ విషయాన్ని తన పై అధికారులకు చెప్పాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ పోలీస్టేషన్ రన్ చేస్తున్న వారిని పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఆరుగురు నకిలీ పోలీసులు ఉన్నారు. కీలక పాత్రధారి అయిన భోలా యాదవ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మిగతా నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. ఇప్పటికే భోలా యాదవ్ మీద పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. తాజాగా నకిలీ పోలీస్ స్టేషన్ ను అడ్డగా ఏర్పాటు చేసుకుని దందాలు నిర్వహించాడని వెల్లడించారు. త్వరలోనే తనను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Also Read: ఈ హోటల్ కేవలం పందులకే - ఫుల్ సెక్యూరిటీ, వైద్యుల పర్యవేక్షణతో లగ్జరీ లైఫ్!