Guinness World Records: వామ్మో వీడు మామూలోడు కాదురా బుజ్జి.. లైఫ్ అంతా బర్గర్‌లు తినే బతికేస్తున్నాడు...
మెక్ డొనాల్డ్ బ్రాండ్‌కు చెందిన జంక్ ఫుడ్‌ని ఇష్టపడని వారుండరు. ఎంత ఇష్టం ఉన్నా రోజూ వీటినే తినలేం కదా? అమెరికాలోని ఓ వ్యక్తి ఏళ్లుగా వీటినే లాగించేస్తున్నాడు. ఎవరా వ్యక్తి?
పీజా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి జంక్ ఫుడ్ అంటే ఇష్టపడని వారుండరు. వీకెండ్స్ వస్తే ఎంచక్కా వాటిని లాగించేస్తుంటారు. ఎంత ఇష్టం ఉన్నా రోజూ వీటినే తినాలంటే మాత్రం కాస్త వెగటుగానే ఉంటుంది. పైగా ఇది జంక్ ఫుడ్. తిన్నామంటే ఆ కొవ్వు కరిగించుకోడానికి జిమ్‌లకు పరిగెత్తాలి. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం బర్గర్లను క్యారేజీలు క్యారేజీలు లాగించేస్తున్నాడు అంట..! ఎంతలా అంటే అతని పేరు మీద గిన్నిస్ రికార్డు కూడా క్రియేట్ అయ్యేంతలా.. అసలు ఎవరీ వ్యక్తి? ఎన్ని బర్గర్లను తిన్నాడు? ఇన్ని తిన్నా అతని ఆరోగ్యానికి ఏం కాలేదా? పదండి చూద్దాం.
అమెరికాలోని విస్కాన్సిన్‌కు చెందిన చెందిన డోనాల్డ్ గోస్క్ అనే 50 ఏళ్ల వ్యక్తి.. బర్గర్లు తినడంలో గిన్నిస్ రికార్డు క్రియేట్ చేశాడు. 1972 నుంచి రోజుకు కనీసం రెండు బర్గర్లను తింటూనే ఉన్నాడు. గిన్నిస్ బుక్ రికార్డ్స్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఐజీటీవీ ప్రకారం డోనాల్డ్ ఇప్పటివరకు 32,340 బర్గర్లను తిన్నాడు.
View this post on Instagram
డోనాల్డ్ బిగ్ మాక్ బర్గర్లకు పెద్ద ఫ్యాన్ అని.. 1972 మే 17 నుంచి వీటిని తినడం ప్రారంభించాడని తెలిపింది. అప్పటినుంచి తాను తిన్న బర్గర్ ప్యాకెట్ల కలెక్షన్, ఆర్డర్ రసీదులను డోనాల్డ్ జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడని పేర్కొంది. డోనాల్డ్ తన మొదటి కారును కొన్న రోజు అయితే ఏకంగా 9 బర్గర్లను తిన్నాడని చెప్పింది.
ఇన్ని బర్గర్లు తిన్నా అతను ఆరోగ్యంగా ఎలా ఉన్నాడనే సందేహం మీకు వచ్చే ఉంటుంది కదా? దీనిపై కూడా డోనాల్డ్ వివరణ ఇచ్చాడు. బర్గర్లతో పాటు ఇచ్చే ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రం తినేవాడిని కాదని.. అదే తన సీక్రెట్ అని చెప్పుకొచ్చాడు. ఇక 30 వేలకు పైగా బర్గర్లను తిన్నా అతని రక్తంలో షుగర్ లెవల్స్, కొలెస్ట్రాల్ స్థాయిలు బానే ఉన్నాయని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తన పోస్టులో పేర్కొంది. డోనాల్డ్ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ 6 మైళ్ల దూరం నడుస్తాడని చెప్పింది.